Drunk Man Bites Back Snake In Revenge : తిరుపతి జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను కాటేసిన పామును తిరిగి కాటేశాడు. ఆ పాము తలను నోటితో తెంపేసి.. తర్వాత దాని పక్కనే పడుకున్నాడు. తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేష్ మద్యానికి బానిస. రోజూ తాగందే ఉండడు. అలాగే గురువారం కూడా మద్యం తాగాడు. ఇంటికి వస్తున్న సమయంలో ఓ పామును తొక్కాడు. దాంతో ఆ పాము కాటు వేసింది. వెంటనే ఆ పామును పట్టుకున్న వెంకటేష్..నోటితే తలను తెంపేసాడు.
తర్వాత ఆ మృత పామును ఇంటికి తీసుకెళ్లి పక్కన పడుకున్నాడు. ఎప్పట్లాగే తాగి వచ్చి పడుకున్నాడని కుటుంబసభ్యులు అనుకున్నారు. కానీ అతను పామును కొరికినట్లు.. పాము అతన్ని కాటేసినట్లుగా గుర్తించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో కుటుంబ సభ్యులు వెంకటేష్‌ను సమీపంలోని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, కానీ మరింత పర్యవేక్షణ అవసరమని డాక్టర్లు తెలిపారు.