రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు జిల్లాలు తీవ్రనష్టం వాటిల్లింది. వరద సహాయక చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీ ఛాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారు. మానవతా దృక్పథంతో సాయం అందించాలన్నారు. బాధితుల కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు సాయం తక్షణమే అందించాలన్నారు. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకున్నారు. వరద సాయం అందించేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వాలన్నారు.
Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
104 కాల్ సెంటర్ ద్వారా సమస్యలు పరిష్కరించండి
వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, రక్షిత తాగునీరు అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 104 కాల్‌సెంటర్ పై విస్తృత ప్రచారం చేసి వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా పరిష్కరించాలన్నారు. ఈ నంబర్ కు ఫోన్ చేసిన వాళ్ల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టాలన్న సీఎం.. అవసరమున్న చోట డ్రైవ్ నిర్వహించాలన్నారు. రోడ్లను పునరుద్ధరించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం.. రవాణా సాగేలా తాత్కాలిక పనులు వెంటనే చేయాలని సూచించారు. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇళ్లు ధ్వంసమైన వారి రూ.95 వేలు
ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పూర్తిగా ఇళ్లు ధ్వంసమైన వారికి రూ. 95,100 సాయం అందించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5200 నగదు వెంటనే అందించేలని సూచించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వరదల్లో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలన్నారు. వారికి రూ.25 లక్షల పరిహారం అందించాలన్నారు. విపత్తు సహాయ కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. పంటల నష్టం అంచనా వేయాలని అధికారులను కోరారు. విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయాలన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా రూ.40 కోట్లు అందించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.
Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !