CM Jagan Reddy : కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ సాయం అందించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన కొడుకుని కాపాడాలని సీఎంను ఓ తల్లి వేడుకుంది.  దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే బాలుడి వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బాలుడి వైద్య ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని కన్నీటిపర్యంతమైన ఆ తల్లికి హామీ ఇచ్చారు జగన్. ఈ ఘటన నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో జరిగింది.


చిన్నారికి సాయం 


టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ సీఎం జగన్ ను కలిసి, తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్‌ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు వివరించింది. కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్‌ మంజూరు చేయాలని సీఎం జగన్ ను అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన సీఎం నంద్యాల జిల్లా కలెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌ జయమ్మ కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. 






ఏవీ ధర్మారెడ్డి కుటుంబానికి పరామర్శ


టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కుమారుడు బుధవారం ( డిసెంబర్ 21) గుండెపోటుతో మరణించారు. సీఎం వైఎస్‌ జగన్‌ నంద్యాల జిల్లాలోని పారుమంచాల గ్రామానికి వెళ్లారు. అక్కడ ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  చంద్రమౌళి రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ధర్మారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు.


పశ్చిమగోదావరి జిల్లాలో 


పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వీరి రెండో సంతానమైన చిన్నారికి అంతుచిక్కని వ్యాధి సోకి అనారోగ్యం పాలైంది. ఎన్నో ఆసుపత్రుల్లో సంప్రదించి చికిత్స అందించారు. కానీ నయం కాలేదు. కానీ ఆ వ్యాధి నయం కావాలంటే కోటి రూపాయలపైగా అవుతుందని వైద్యలు తేల్చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ చిన్నారి‌ కుటుంబం అయోమయం స్థితిలో పడింది. తమకు ఎవరు సాయం చేస్తారో తెలియని స్థితిలో తెలిసిన వారందనీ సాయం అడిగారు. కానీ అంత మొత్తంలో డబ్బును ఎవరూ సమకూర్చలేకపోయారు. జులై నెలలో సీఎం జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అదే సమయంలో సీఎంను కలిసేందుకు దంపతులిద్దరూ సీఎం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ను ఆపమని ఆదేశించారు. ఆ దంపతులను సీఎం వద్దకు తీసుకెళ్లారు. దీంతో సీఎం వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి చికిత్సకు హామీ ఇచ్చిన జగన్, ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.  దీంతో సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయన ఓఎస్డీ ప్రత్యేక చొరవ చూపి చిన్నారి వైద్యానికి అయ్యే నగదును విడుదల చేశారు.