Ys Jagan Mohan Reddy: రెండు నెలల్లోనే ఏపీలో సంకీర్ణ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉండి ఉంటే పథకాలన్నీ ఇప్పటికే ప్రజలకు చేరి ఉండేవని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. మళ్లీ మా పార్టీ గెలుపు ఖాయమని జగన్ జోస్యం చెప్పారు.


పథకాలన్నీ సకాలంలో వచ్చేవి
తాజాగా  విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళవారం అనకాపల్లి, చోడవరం , మాడుగుల నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు , జడ్పీటీసీలతో తాడేపల్లిలోని క్యాంపు  ఆఫీసులో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  జగన్‌ అధికారంలో ఉండి ఉంటే సకాలంలో .. నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం అన్ని వర్గాలకు పథకాలు అందేవని గుర్తు చేశారు. మీ జగనే ఉండి ఉంటే.. ఈపాటికే రైతు భరోసా అందేదని, స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లికి అమ్మ ఒడి అందేదన్నారు. అలాగే, సున్నావడ్డీ నిధులు కూడా జమ అయ్యేవని, విద్యాదీవెన, వసతి దీవెన వచ్చేవని, మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేవని, చేనేతలకు నేతన్న నేస్తం కూడా వారి అకౌంట్లలో ఇప్పటికే జమ అయ్యేదని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఆగస్టు నెలాఖరునాటికి ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను అధికారంలో లేకపోవడం వల్ల ఈ పథకాలన్నీ లబ్ధిదారులకు దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రతి ఇంటికి మంచి చేశామని, చేసిన మంచి ఎక్కడికీ పోదని, వచ్చే ఎన్నికలు మనకు శ్రీరామరక్ష అని జగన్ పేర్కొన్నారు. 


రెడ్ బుక్ పాలన 
 శాంతి భద్రతలు క్షీణించాయని..  రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా , ఏ పార్టీకైనా కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తరువాత వెలుగు ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజలకు ఆశ చూపి గెలిచారని, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నైజం బయటపడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభం ఉన్నా అప్పట్లో తన ప్రభుత్వం సాకులు చూపలేదని, మాట తప్పుకుండా మేనిఫెస్టో పొందుపరిచినవి అన్నీ అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేశామన్నారు. ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే శ్రీరామ రక్ష అని నమ్మామని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు. తాను పలావు ఇచ్చానని.. బాగానే చూసుకున్నాననని ప్రజలు అంటున్నారన్నారని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ప్రజలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని జగన్ విమర్శించారు. 



ప్రతి అడుగులో మోసం
విద్యార్థులకు విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్‌‌మెంట్‌, వసతి దీవెన సకాలంలో వచ్చేదన్నారు. మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేదన్నారు. ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయిందన్నారు. జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి అడుగులో మోసం కనిపిస్తుందన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదని.. ఇప్పటికే రూ.1600 కోట్ల బకాయిలు ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌  పూర్తిగా దిగజారిపోయిందన్నారు.  చంద్రబాబు మోసాలను చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందన్నారు. 2029లో మళ్లీ మన పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని జగన్ అన్నారు.