Andhra Pradesh Assemby Budeget Sessions 2024: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (YSRCP) ప్రభుత్వం. ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనుండగా... 6వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టనుంది జగన్ సర్కార్. ఈ బడ్జెట్ సమావేశాలు మూడు నుంచి ఐదు రోజుల పాటు జరుగుతాయని సమాచారం.
ఎన్నికల వేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు. దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరుగుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేయనుంది. 2023-24తో పోలిస్తే మొత్తం వ్యయం 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో తెలుగుదేశం పార్టీ హయాంలోని 2014-19తో పోలుస్తే... ఈ ఐదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని హైలైట్ చేసే అవకాశం ఉంది. రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న రుణాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని... బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్టు సీనియర్ అధికారులు చెప్తున్నారు. సంక్షేమ పథకాల వ్యయం, ఉపాధి కల్పనకు సంబంధించిన కీలక డేటాను ఆర్థిక శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపినట్లు తెలుస్తోంది.
గత బడ్జెట్ వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను... 2లక్షల 79వేల 279 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేసింది, ఇందులో సింహభాగం నవరత్నాల కింద అమలవుతున్న ప్రధాన సంక్షేమ పథకాలకే కేటాయించింది. రెవెన్యూ వ్యయం 2లక్షల 28వేల 540 కోట్లు కాగా.... మూలధన వ్యయం 31వేల 61 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,316కోట్లు ఉండగా... ద్రవ్య లోటు రూ.54,587 కోట్లుగా ఉంది. ఆర్థిక లోటు GSDPలో 3.77 శాతం కాగా... రెవెన్యూ లోటు GSDPలో 1.54 శాతంగా ఉంటుంది. ఇక... 2022-23లో బడ్జెట్ వ్యయం రూ.2.56 లక్షల కోట్లు కాగా... 2021–22లో బడ్జెట్ వ్యయం రూ.2.29 లక్షల కోట్లు.