Gratuity for Anganwadi workers in Andhra Pradesh Budget 2025: అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అంశంతో పాటు వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. మహిళలు, వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు కీలక అంశాలను పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు.
మహిళకు సాధికారత కల్పిస్తే..
అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించిన భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపు పొందిన సావిత్రిబాయి పూలే మాటలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. 'ఒక మహిళకు సాధికారత కల్పిస్తే- మొత్తం సమాజాన్నే ఉద్దరించినట్లు అవుతుంది' అన్న సిద్ధాంతాన్ని దృఢంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వసిస్తారని అన్నారు. అందుకే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి ఆయన అని కితాబు ఇచ్చారు.
దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్
వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగమయ్యారని అభిప్రాయపడ్డారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా, దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు వని చేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాని ప్రశంసించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే, రాష్ట్ర సంక్షేమ విధానాలను, రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందిందని పేర్కొన్నారు.
స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం ప్రక్కదారి పట్టించిందని ఆరోపించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు విఘాతం కలిగించిందని విమర్శించారు. మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా, ఈ ప్రభుత్వం ప్రస్తుతం దిద్దుబాటుచర్యలు చేపడుతోంని తెలిపారు.
నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ.సి.డి.ఎస్.), మిషన్-శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి తగిన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు పయ్యావుల. మేనిఫెస్టోలోని హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేశామని పేర్కొన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారరు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహిళలు, పిల్లలు, దివ్యాంగులు వృద్ధుల సంక్షేమానికి 4,332 కోట్ల రూపాయల కేటాయించారు.