Andhra Pradesh Budget 2025: ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అదే విధంగా మత్స్యకారులకు అందించే సాయాన్ని రెట్టింపు చేసినట్లు ఏపీ బడ్జెట్ లో మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. జీవితంలో డాక్టర్, లాయర్, పోలీస్‌, టీచర్‌ అవసరమని చెబుతూ ఉంటారు. కానీ రైతు ప్రతిరోజూ అవనరం అని పయ్యావుల తెలిపారు. ఆ రైతు మూడు పూటలా అవసరమని అభిప్రాయపడ్డారు. కాబట్టి అలాంటి అన్నదాతలకు కృతజ్ఞతా భావంతో మరో నూవర్ సిక్స్ హామీ నెరవేర్చడానికి సిద్దమవుతున్నామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా "అన్నదాత సుఖీభవ పథకం " కింద ప్రతి రైతుకు ఏటా 20 వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని చెప్పారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ వంపుసెట్లకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తోందన్నారు. 

వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదన్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.ఎన్. స్వామినాథన్ మాటలు గుర్తు చేసుకున్న పయ్యావుల... ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగం పురోభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వివిధ వ్యవసాయ పథకాల క్రింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిల్లో 693 కోట్లను చెల్లించామని తెలిపారు. 

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకున్న ప్రాధాన్యత వారికి తెలియదన్నారు. డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలోనే లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను చంద్రబాబు గుర్తించారని అన్నారు. దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న రోజుల్లో గత పాలకుడు నిర్లక్ష్యం చేశాడని అన్నారు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే... నేషన్ థింక్స్ టుమారో... అనేదానికి ఇదే నిదర్శనం అని పయ్యావుల కేశవ్ అన్నారు.

డ్రిప్ ఇరిగేషన్ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు పయ్యావుల. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్ల రూపాయలను విడుదల చేసి, అదనంగా 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కిందకు తెచ్చామని వెల్లడించారు.  

మత్స్యకారులకు రూ.20 వేలుచేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తున్నామని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయించారు.