AP Budget 2022 : నేడు (శుక్రవారం) ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet) భేటీ అవుతుంది. ఈ సమావేశంలో 2022-23 బడ్జెట్ (Budget) కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రేపు ఉదయం 10.15 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.  శాసనమండలిలో మంత్రి సిదిరి అప్పలరాజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను ఉదయం 11 గంటలకు మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ప్రవేశపెడతారు. రేపు ఉదయం 9 గంటలకు  కేబినేట్ భేటీలో రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. రూ.2,30,000 కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. వ్యవసాయ, విద్యా, వైద్య ఆరోగ్య రంగాలకు బడ్జెట్ లో పెద్ద పీట వేసినట్లు సమాచారం. 


నవరత్నాలకే కేటాయింపులు!


ఏపీ రెవెన్యూ తగ్గిపోయిన కారణంగా కేంద్ర పన్నుల వాటాపైనే రాష్ట్రప్రభుత్వం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినా సంక్షేమ పథకాలకు కేటాయింపుల్లో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదంటుంది. ఈ సారి బడ్జెట్‌లో మళ్లీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తారా లేక పన్నుల ప్రతిపాదిస్తారా అని వేచిచూడాల్సి ఉంది. అలాగే ఆదాయ మార్గాల అన్వేషణపై కూడా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ లో ముఖ్యంగా నవరత్నాల పేరుతో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపేట వేసే అవకాశం ఉంది. వీటితో పాటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కేటాయింపులు పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తవాటికి ఏమైనా కేటాయింపులు చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉన్నందున బడ్జెట్ ఈ విషయంపై స్పష్టం ఇచ్చే అవకాశం ఉంది.


హైకోర్టు తీర్పుపై కేబినెట్లో చర్చిస్తారా? 


ఇటీవల అమరావతికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై పలువురు మంత్రులు, వైసీపీ నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడారు. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి కొన్ని రోజుల ముందే అమరావతి విషయంపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం బిల్లుపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో రాజధాని నిర్మాణం, పాలనా వికేంద్రీకరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు తరించడం, అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయడం  కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజధానల అంశం కేబినెట్ లో చర్చకు వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తీర్పు తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డి మూడు రాజధానులే ప్రభుత్వ ఉద్దేశమని మాట్లాడారు.