AP Assembly 2022 Live Updates: ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నిక
నేటి ఏపీ అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్ ఈ లైవ్ పేజీలో చూడవచ్చు. తాజా సమాచారం కోసం ఈ బ్లాగ్ ని రీఫ్రెష్ చేయండి.
మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రైతుల నిరసన సెగ
సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడదూకి ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులు
రైతుల ఆందోళనతో అసెంబ్లీ-సచివాలయం మార్గంలో భారీగా నిలిచిపోయిన వాహనాలు
ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఎస్కార్ట్ వాహనాల మోతతో దద్దరిల్లిన అసెంబ్లీ పరిసరాలు
రైతులను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేసేవరకు అసెంబ్లీకి వెళ్లే మార్గం లేక వాహనాల్లో ఉండిపోయిన ప్రజాప్రతినిధులు
ఏపీ అసెంబ్లీని తాకిన టీడీపీ రైతు విభాగం నిరసన, పలువురు రైతు నేతల అరెస్ట్
పోలీసు వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీకి చేరుకున్న తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
పోలీసులకు, రైతు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం – కొద్దిసేపు అసెంబ్లీ మార్గంలో నిలిచిన వాహనాలు
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు నాయకుల అరెస్ట్
రైతులకు న్యాయం జరిగేవరకూ ప్రభుత్వాన్ని వదిలేది లేదంటున్న మర్రెడ్డి, రైతు నాయకులు
సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడదూకి ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నంచిన రైతులు
అమరావతి: అసెంబ్లీ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్న తెలుగు రైతు కార్యకర్తలు...
అసెంబ్లీ వైపు వెళ్తోన్న తెలుగు రైతు ప్రతినిధులని అడ్డుకుంటోన్న పోలీసులు...
తెలుగు రైతులను అదుపులోకి తీసుకుంటోన్న పోలీసులు...
పోలీసులకూ.. తెలుగు రైతులకు మధ్య తోపులాట, వాగ్వాదం.
క్వశ్చన్ అవర్‌లో పోలవరంపై తీవ్రమైన చర్చ జరిగింది. పోలవరం నిర్వాసితులకు ఎకరాలకు పది లక్షలు ఇస్తామన్న విషయంపై మొదలైన చర్చ వాగ్వాదానికి చోటు చేసుకుంది. అసలు అలాంటి హామీ తాము ఇవ్వలేదని తేల్చేశారు మంత్రి అంబటి రాంబాబు.
2013లో వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మేలు జరుగుతుందన్నారు అంబటి రాంబాబు. వాళ్లకు ఐదు లక్షలు ఎంత తక్కువైతే అంతా ఇస్తామని మాత్రమే చెప్పామన్నారు. మిగతా నిర్వాసితులకు కేటగిరీల వారీగా కేంద్రం పరిహారం ఇస్తుందని... అది పది లక్షలకు ఎంత తక్కువైతే అంతా ఇచ్చేందుకు మాత్రమే హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం నష్టపోయిన రైతులకు ఐదు లక్షలు, కేంద్రం పరిహారంతో సంతృప్తి చెందని ప్రజలకు పదిలక్షలు పరిహారం వచ్చేలా చూసేలా రాష్ట్రం ప్రయత్నిస్తుందన్నారు.
రైతు ద్రోహి జగన్ అంటూ అసెంబ్లీ ముందు టీడీపీ నేతలు నిరసన తెలిపారు. నిరసన కోసం తీసుకొచ్చిన ఎడ్ల బళ్లని తరలించి, రైతుని అరెస్ట్ చెయ్యడం వైసిపి ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని నారా లోకేష్ ట్వీట్ చేశారు. మోటర్లకి మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరి తాళ్లు బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ధాన్యం బకాయిలు చెల్లించడం లేదు. కనీసం విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీ ప్రకారం రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ కి ర్యాలీగా వెళ్ళామని లోకేష్ ట్వీట్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు విషయంపై సీఎం జగన్ కూడా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎంత మేర పూర్తి చేశారో తెలుపుతూ ఫోటోలతో ప్రదర్శన ఇచ్చారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి కాకుండానే చంద్రబాబు ప్రభుత్వంలో కాపర్ డ్యాం కట్టారని అది మతి లేని చర్య అని సీఎం జగన్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేగా పని చేసేందుకు కూడా చంద్రబాబు అన్ ఫిట్ అని అన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణమని అన్నారు.
ఏపీ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలవరం అంశం చర్చకు వచ్చింది. పోలవరం నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేశామని నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. టీడీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడవద్దని అంబటి అన్నారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారని అన్నారు. తాము పోలవరానికి కట్టుబడి ఉన్నామని, పూర్తి చేసి తీరతామని అంబటి రాంబాబు చెప్పారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు అంతా రెడీ అయింది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఏపీ అసెంబ్లీ ఎన్నుకోనుంది. గత డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. రెండున్నర సంవత్సరాల తరువాత కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నిబంధనల ప్రకారంమే కోన రఘుపతి రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా వైధ్య సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ వేయగా, ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. ఈయన 2019 ఎన్నికల్లో విజయనగరం నుంచి కోలగట్ల విజయం సాధించారు.
నేడు ఏపీ అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. నేటి సభలో 8 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. విద్య, వైద్యం, నాడు - నేడు పై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Background
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పిటిషన్ వేశామన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ఆరోపించారు. అప్పట్లో రాజధానిపై చంద్రబాబు వేసింది ఎక్స్‌పర్ట్ కమిటీ కాదని, ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ అని ఎద్దేవా చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవ్వడంతో ఉద్యమాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు భంగం వాటిల్లే విధంగా ఉన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
రాజధాని అంశం రాష్ట్రానికి చెందినదే
"రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శాసనసభలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై అధికారం లేదని సరికాదని శాసనసభ అభిప్రాయపడింది. సీఆర్డీఏ చట్టాన్ని 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అది కేంద్రం చేసిన చట్టం కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి మార్చడానికి అధికారం లేదని అనడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాం. టీడీపీ ఎంపీ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. రాజధాని అంశంపై రాష్ట్రానికి చెందినది అని కేంద్రం చెప్పింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలను గుర్తుచేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశాం. పునర్విభజన చట్టం ప్రకారం ఓ కమిటీని ఏర్పాటుచేసి దాని ప్రకారం రాజధానిని నిర్ణయించారని కోర్టు తీర్పులో ఉంది. 2014లో రాజధానిపై వేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇది ఎలా చెల్లుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం." - మంత్రి గుడివాడ అమర్ నాథ్
చంద్రబాబుకు ఎందుకంత తపన
చంద్రబాబు అతని అనుచరులు అమరావతి ప్రాంతంలో ఎవరికీ తెలియకుండా ముందుగానే భూములను కొనుగోలు చేసి ఆ తర్వాత దానిని రాజధానిగా ప్రకటించారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చంద్రబాబు తను కట్టని, కట్టలేని దానికోసం ఎందుకు తపనపడుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు కనీసం యాభై ఎనిమిది నెలలపాటు అమరావతిని పాలించలేని ఆయన రాష్ట్రాన్ని ఏం చేయాలని ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలనే తపనతో ముఖ్యమంత్రి ప్రయత్నాలు సాగిస్తుంటే కేవలం 29 గ్రామాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్న రాజకీయ యాత్ర అని అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతితో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేస్తామని, అమరావతి పూర్తిగా అభివృద్ధి చేయడానికి 2024 వరకు తమ ప్రభుత్వానికి సమయం ఉందని అమర్నాథ్ తెలియజేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -