పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాలు, పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయ నిర్మాణాలు వద్దంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా నిర్మాణాలను ఇంకా కొనసాగించడంపై ఏపీ హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. ఈ అంశంపై నలుగురు ఐఏఎస్ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. దీంతో పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ దివ్వేది, అదే శాఖ కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ సెక్రటరీ శ్రీలక్ష్మీతో పాటు ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ కూడా కోర్టుకు హాజరయ్యారు.
స్కూల్ ఆవరణలో భవనాలు నిర్మించవద్దని...ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ధర్మాసనం మండిపడింది. పిల్లలు చదువుకునే స్కూళ్లను కలుషితం చేస్తున్నారని.. అక్కడకు రాజకీయాలను తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించింది. వీటిపై ఐఏఎస్ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వం తరపున వాదించిన లాయర్ మాత్రం.. అన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నివేదిక ఇస్తామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఆ రోజున మళ్లీ ఉన్నతాధికారులంతా హాజరు కావాలని ఆదేశించింది.
నెల్లూరు జిల్లా కోటపోలూరు, కర్నూలు జిల్లాల్లో తాళ్లముడిపిలో పాఠశాలల ఆవరణలో గ్రామసచివాలయాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాగే నిర్మాణాలు జరుగుతున్నాయి. బడి ఆవరణలో గ్రామసచివాలయాలు కట్టవద్దని గతేడాది జూన్‌లో హైకోర్టు ఆదేశించింది. అయినా ప్రభుత్వం వినిపించుకోలేదు. దీంతో గత జూలై 13వ తేదీన విచారణ జరిపిన హైకరోర్టు సుమోటోగా కేసులు నమోదు చేసింది. పాఠశాల విద్య కమిషనర్, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను ప్రతివాదులుగా చేర్చి నోటీసులు పంపింది. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకే ఉన్నతాధికారులు హైకోర్టుకు హాజరయ్యారు. కాని వారు కోర్టుకు సరైన సమాధానం చెప్పలేకపోయారు.
ఏపీలో అధికారులు కోర్టులు తీర్పులు ఉల్లంఘించడం.. హైకోర్టు ఆగ్రహానికి గురి కావడం కొత్తేమీ కాదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ సహా అనేక మంది కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎదుర్కొంటున్నారు. తరచూ ఆయన హైకోర్టుకు హాజరవుతున్నారు. పలువురు అధికారులపై హైకోర్టు కేసులు కూడా నమోదు చేస్తూ ఆదేశాలిచ్చింది. తాజాగా మరో నలుగురు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల ఆవరణల్లో గ్రామ సచివాలయాల నిర్మాణం ఆపకపోవడంపై ప్రభుత్వం ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు వీరిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
డీజీపీ కూడా ఒకటి రెండు సార్లు కోర్టు మెట్లెక్కారు. కోర్టుకు సమాధానం ఇచ్చుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు చేసిన తప్పులకు అధికారులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారని ఆరోపిస్తున్నాయి.