TTD Released Special Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. 2024, ఫిబ్రవరి నెలకు సంబంధించి రూ.300 టికెట్లను అధికారులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. భక్తులు దేవస్థానం అధికారిక వెబ్ సైట్ www.tirumala.org లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు, తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. 


వైభవంగా కైశిక ద్వాదశి


కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్ర‌వారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామి వారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.45 నుంచి 5.45 గంట‌ల్లోపు తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంట‌ల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహించారు. పురాణాల ప్ర‌కారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా శ్రీ మహా విష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. ఈ మహోత్సవాన్ని ప్రతిఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.


ఘనంగా చక్రతీర్థ ముక్కోటి


తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి సైతం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి  చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహ స్వామి వారికి, ఆంజనేయ స్వామికి అభిషేకం, పుష్పాలంకారణ చేసి హార‌తి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


భక్తుల రద్దీ


అటు, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 45,503 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం గురువారం రూ.3.27 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


న‌వంబ‌రు 27న శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌


అలాగే, 2024 ఫిబ్రవ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినానికి సంబంధించిన‌ శ్రీ‌వారి సేవ స్లాట్ల‌ను న‌వంబ‌రు 27న ఉద‌యం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. 18 నుంచి 50 ఏళ్ల వ‌ర‌కు వ‌యోప‌రిమితి ఉన్నవారు మాత్ర‌మే ఈ స్లాట్ల‌ను బుక్ చేసుకునేందుకు అర్హులు. అదే విధంగా, తిరుమ‌ల‌, తిరుప‌తిలో భ‌క్తుల‌కు స్వ‌చ్ఛంద సేవ చేసేందుకు 2024 జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల‌కు సంబంధించిన శ్రీ‌వారి సేవ, న‌వ‌నీత సేవ‌ కోటాను న‌వంబ‌రు 27న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. అదే రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. ఈ సేవ‌ల‌ను www.tirumala.org వెబ్‌సైట్‌లో భ‌క్తులు బుక్ చేసుకోవ‌చ్చు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: Foreign Direct Investments: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు - తెలుగు రాష్ట్రాల స్థానమిదే