Andhra News Praveen Kumar Reddy Arrest :  ప్రొద్దుటూరు : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని (GV Praveen Kumar Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. నందం సుబ్బయ్య (Nandam Subbaiah) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ కార్యకర్త బెనర్జీపై గత నెల 28వ తేదీన తెలుగుదేశం కార్యకర్తలు భరత్, రాము కత్తితో దాడి చేశారు. ఈ దాడికి కుట్ర చేసింది  ప్రవీణ్ కుమార్ రెడ్డినేనని పోలీసులుకేసు నమోదుచేశారు. దీంతో అరెస్టు  చేస్తారన్న ఉద్దేశంతో  గత 17 రోజులుగా ప్రవీణ్  రెడ్డి అజ్ఞాతంలో  ఉన్నారు. సోమవారం తెలుగుదేశం నేతలతో కలిసి ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.


దాడితో సంబంధం లేకపోయినా.. అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ప్రవీణ్ సహా తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. జీపు ఎక్కకుండానే.. త్రీ టౌన్ స్టేషన్‌కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు. ప్రవీణ్‌తో పాటు కుటుంబ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి, కార్యకర్తలు కూడా పాదయాత్రగా ఆయన వెంటే వెళ్లారు. ప్రవీణ్ అరెస్టు ఘటన పట్టణంలో సంచలనంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కుట్రతోనే తనను అక్రమ కేసులో ఇరికించారని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపింంచారు. వైసీపీ నేత బెనర్జీపై దాడి కేసులో కుట్రదారుడిగా పేర్కొంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు డీఎస్పీ ప్రకటించారు. 


దాడి గఠన సమయంలో  తాను అక్కడ లేకపోయినప్పటికీ తనపై కేసు నమోదు చేయడం పట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు జీపు ఎక్కాలని ఎంత ఒత్తిడి చేసినా ఎక్కకుండా నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత నెల 28న ప్రొద్దుటూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ఈ బస్సుయాత్రలో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ కార్యకర్త బెనర్జీ సైతం పాల్గొన్నారు. గాంధీ రోడ్డులోని మెడినోవా సర్కిల్‌ వద్ద వైసీపీ నేత బెనర్జీపై తెలుగు యువత నాయకుడు భరత్‌ కుమార్‌ రెడ్డి కత్తితో దాడి చేశాడు. బెనర్జీకి, భరత్ కుమార్ రెడ్డికి   వ్యక్తిగత విబేధాలు ఉన్నాయి.  బెనర్జీ తల, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే బెనర్జీ కుప్పకూలిపోయాడు. అనంతరం భరత్ కుమార్ రెడ్డి కత్తిని సంఘటనా స్థలంలోనే పడేసి బుల్లెట్‌పై పరారయ్యాడు. 


తెలుగు యువత నాయకుడు భరత్ కుమార్ రెడ్డి ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈ కారణంగా కుట్రదారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డినేనని హత్యాయత్నం కేసు పెట్టారు పోలీసులు. దీంతో గత 17 రోజులుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి అజ్ఞాత వాసంలో ఉన్నారు. ఈ మధ్యలో పోలీసులు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకుని మరీ విచారించారు. అయితే తాజాగా అజ్ఞాతవాసం వీడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖండించారు.