ఆధునిక కాలంలో ప్రేమలు దేశాలు దాటుతున్నాయి. తాము ప్రేమించిన వ్యక్తుల కోసం దేశాలు దాటుతున్నారు. నచ్చిన భాగస్వాముల చెంతకు చేరుతున్నారు. పబ్జిలో పరిచయమైన నోయిడాకు చెందిన సచిన్‌ మీనా కోసం పాకిస్తాన్ నుంచి సీమా హైదర్ నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. సీమా పాకిస్తాన్ ఏజెంట్ అని, ఆమె సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడని తెలుస్తోంది.


ఇంకో ప్రేమ ఏకంగా ఖండాలు దాటింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమించిన వ్యక్తి కోసం పోలండ్‌కు చెందిన మహిళా పోలాక్‌ బార్బరా (45) జార్ఖండ్‌  రాష్ట్రం హజారీబాగ్‌ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందిన మహ్మద్‌ షాదాబ్‌ (35) కోసం వచ్చింది. షాదాబ్‌ కోసం ప్రత్యేకంగా ఇల్లు కట్టిస్తోంది. వీసా వచ్చాక అతడిని పోలండ్‌ తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌లో వాతావరణం తట్టుకోలేక పోతున్న బార్బరా కోసం షాదాబ్ ఏసీ ఏర్పాటు చేశాడు. ఆమెను చూసేందుకు చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


మరో వివాహిత తన ప్రియుడి కోసం రాజస్థాన్ నుంచి పాకిస్తాన్ వెళ్లింది. రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌ కు వెళ్లింది. అక్కడ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లాలో తిరుగుతూ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. అయితే తమ ఇద్దరి మధ్య స్నేహమే ఉందని కేవలం పాకిస్తాన్ చూడటానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు చెబుతోంది అంజు. వీరిద్దరూ సరదాగా తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తాజాగా ఇలాంటి ప్రేమ కథ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. ఆరేళ్ల్ క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై అది కాస్త ప్రేమగా మారడంతో శ్రీలంక చెందిన అమ్మాయి భారతదేశంలో అడుగుపెట్టి  ప్రియుడుతో వివాహం చేసుకుంది. వివరాలు.. చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆరిమాకునపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు  ఆరు సంవత్సరాల క్రితం శ్రీలంకలోని  బల గుండుకు చెందిన ఫేస్‌బుక్‌లో విఘ్నేశ్వరితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ప్రియున్ని కలిసేందుకు టూరిస్ట్ వీసాతో చిత్తూరు జిల్లా చేరుకుంది. స్థానికంగా ఉన్న ఓ గుడిలో లక్ష్మణ్‌, విఘ్నేశ్వరి వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి లక్ష్మణ్ ఇంట్లో పెద్దలు సైతం అంగీకరించారు. 


అనుకోని ట్విస్ట్..
అంతా సాఫీగా సాగున్న ప్రేమ వ్యవహారానికి అనూహ్యంగా మరో చిక్కు ఎదురైంది. విఘ్నేశ్వరి ఇండియాకు వచ్చిన టూరిస్ట్ వీసా వ్యాలిడిటీ గడువు ముగిసింది. ఆ సమాచారం కాస్తా పోలీసులకు తెలియ తెలియడంతో విగ్నేశ్వరిని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఆ అమ్మాయిని తిరిగి శ్రీలంకకు పంపేందుకు అధికారులతో చర్చిస్తున్నారు. అయితే విఘ్నేశ్వరీ మాత్రం తాను తిరిగి శ్రీలంకకు వెళ్లనని తన భర్తతో ఇక్కడే ఉంటానని చెబుతోంది. మరి ఈ ప్రేమికుల వ్యవహారంలో అధికారులు ఎలా స్పందిస్తారో, వీరి కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతోందో.







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial