Daggupati Prasad: అనంతపురంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడించేందుకు కృషి చేస్తానని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో పేకాట తీసేసి నాలుగున్నరేళ్లు అయ్యిందని, దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే తాను జిల్లా కలెక్టర్, పాత ఎస్పీతోనూ మాట్లాడటం జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఆయన అన్నారు.
కరోనా టైంలో పేకాట ఆడకపోవడం వలన 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని ఎమ్మెల్యే ప్రసాద్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్బులో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇక్కడకి వచ్చే వారంతా రిటైర్డు ఉద్యోగులు సంఘంలో గౌరవం ఉన్నవారేనని ఆయన అన్నారు. క్లబ్బుకు ఎన్నికలు లేకుండా ఒక మంచి వ్యక్తిని చూసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందనేది తన అభిప్రాయమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తన సహకారం సంపూర్ణంగా ఉంటుందని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బులను మూసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపారు. రీక్రియేషన్ క్లబ్బుల పేరుతో జరుగుతున్న జూదాన్ని అణచివేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పేకాట, బెట్టింగ్‌ల కారణంగా కుటుంబాలు చితికిపోతున్నాయని వాటిని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు.
ఆన్‌లైన్ పేకాట నిషేధిస్తూ చట్టసవరణ చేసిన జగన్ ప్రభుత్వం
క్లబ్బుల నిర్వహణ ద్వారా గతంలో కోట్లలో బిజినెస్ నడిచేది. క్లబ్‌లో ప్రతి ఆటకు కమీషన్ పేరుతో ఒక్కో టేబుల్ నుంచి సుమారు రూ.వెయ్యి చొప్పున వసూలు చేసేవారు. కనీసం 20కి పైగా టేబుల్స్‌తో రోజూ పేకాట శిబిరాలు నడిచేవి. వాటి ద్వారా నిర్వాహకులు నెలనెలా కోట్ల వ్యాపారం చేసేవారు. ఉదయం 10 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా ఈ పేకాట కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్లబ్‌ల బారిన పడి ఎంతోమంది సర్వస్వం పోగొట్టుకుని తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.
అప్పులపాలై కుటుంబాలు చిన్నాభిన్నం అయిన ఉదంతాలు ఉన్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ చట్టానికి కూడా గత జగన్ ప్రభుత్వం సవరణలు చేసింది. ఆన్‌లైన్ రమ్మీ లాంటి క్రీడలపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వాటిని ఎవరైనా ప్రోత్సహించినా, ఎక్కడైనా నిర్వహించినా, ఆడినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టం చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్ గేమింగ్ చట్టానికి సవరణ చేసింది. ఆన్ లైన్లో రమ్మీ, పోకర్ నిర్వహించే వారికి జరిమానాతోపాటు శిక్ష విధించేలా జీవో జారీ చేయాలని నాడు కేబినెట్ తీర్మానం చేసింది.