Payyavula Kesav Security : టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భద్రతలో భాగంగా 1+1 గన్ మెన్లను కొనసాగిస్తున్నామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. గన్ మేన్లను ఉపసంహరిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు.  ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రతను అలానే కొనసాగిస్తామన్నారు. 


మార్చారంతే తొలగించలేదు


"ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు గన్ మెన్లను తొలిగించినట్లు  మీడియా వార్తలు వస్తున్నాయి. అవి అవాస్తవం. ఆయనకు ఎస్ఆర్సీ కమిటీ సిఫార్స్ మేరకు 1+1 గన్ మెన్లు కొనసాగిస్తున్నాం. ప్రొసిజర్ ప్రకారం గన్ మెన్లను మారుస్తుంటాం. కొందరు లీవ్ ఉంటారు, ఆరోగ్యం బాగోకపోవడం కారణాలతో గన్ మెన్లను మారుస్తుంటాం. అయితే గన్ మెన్లను తొలగించామన్న ప్రచారం అవాస్తం. గన్ మెన్లను మార్చామంతే తొలగించలేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మారుస్తున్నాం. ఆరు నెలలకొకసారి సిబ్బంది పనితీరు ఆధారంగా కొత్తవారిని నియమిస్తాం " -ఎస్పీ ఫకీరప్ప 


భద్రత విషయంలో ట్విస్టులు


పయ్యావుల కేశవ్ వ్యక్తిగత భద్రత తొలగింపు ఎపిసోడ్ లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. గన్ మెన్లను కంటిన్యూ చేస్తున్నామని  అనంత జిల్లా ఎస్పీ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం పయ్యావుల వద్దకు కొత్త గన్ మెన్ వచ్చారు.  తనను వ్యక్తిగత భద్రత సిబ్బందిగా నియమించారని పయ్యావులకు పరిచయం చేసుకున్నారు. సంప్రదాయం ప్రకారం యూనిఫాంలో ఉన్న ఆర్ఐ వచ్చి పీఎస్ఓను మారుస్తున్నామన్న విషయాన్ని వెల్లడించాలని పయ్యావుల అన్నారు. వచ్చిన వ్యక్తి గన్ మెన్ అవునో కాదో తనకు తెలియడంలేదన్నారు. ఆర్ఐ వచ్చి గన్ మెన్లను మార్చిన విషయాన్ని తెలిపాలన్నారు. కొత్త పీఎస్వోను పరిచయం చేసిన వెంటనే విధుల్లో చేరమని గన్ మెన్ కు పయ్యావుల సూచించారు. 


తొలగించినట్లు ప్రచారం 


తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌‌కు ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని ప్రచారం జరిగింది.  ఆయనకు భద్రతగా ఉన్న ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం వెనక్కి రప్పించింది. ఈ విషయం చర్చనీయాంశం అయింది. ఆదివారం వరకూ పయ్యావుల కేశవ్ కు 1+1 గన్‌మెన్లు భద్రతగా ఉండేవారు. తనకు సెక్యూరిటీని పెంచాలని కొద్దిరోజుల క్రితమే పయ్యావుల కేశవ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే పీఏసీ ఛైర్మన్‌గా కేబినెట్ హోదా ఉన్న వ్యక్తికి భద్రతను వెనక్కి పిలవడంపై చర్చనీయాంశం అయింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చాకే ఆయనకు భద్రతను తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలా ప్రవర్తించిందని విమర్శిస్తున్నారు. టీడీపీ చేస్తున్న విమర్శలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రజా ప్రతినిధులకు కేటాయించే గన్‌మెన్లను మూడేళ్లకు ఓసారి ట్రాన్స్‌ఫర్ చేసే నిబంధన ఉందని, అందుకే ఆయనకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్‌మెన్లను ఉపసంహరించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఆయనకు కొత్త భద్రతా సిబ్బంది నియామకం అవుతారని చెప్పారు.