Anantapur Seb Police: అనంతపురం పోలీసులు పొరపాటు పడి తమ జులుం ప్రదర్శించారు. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడం కోసం ప్రయత్నించి మరో వ్యక్తిపై ప్రతాపం చూపారు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టి, గాయపర్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది. సెబ్ పోలీసులు పొరపడి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను గాయపర్చిన ఘటన ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. అనంతపురంలోని జేఎన్‌టీయూ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మంగళవారం (నవంబర్ 21) తెల్లవారుజామున జరిగింది.
అనంతపురం నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి రోజూ మార్నింగ్ వాక్ కోసం స్థానిక జేఎన్‌టీయూ గ్రౌండ్ కు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రోజూ లాగే నవంబరు 21న కూడా ఉదయం వాకింగ్ కి వెళ్లారు. ఇంతలో ఇద్దరు అకస్మాత్తుగా వచ్చి అతణ్ని గట్టిగా పట్టుకున్నారు. ఏం జరిగిందో అర్థం కాక, భయపడిన చంద్రశేఖర్ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వారు సివిల్ డ్రెస్ లో ఉండడంతో చంద్రశేఖర్ వారిని దొంగలుగా భావించి ఎదురుదాడి చేశాడు. దీంతో ఆ ఇద్దరు కలిసి చంద్రశేఖర్ రెడ్డి పై మరింత దాడి చేసి బలంగా తోసేశారు. దీనివల్ల చంద్రశేఖర్ తలకు బాగా గాయం అయింది. గమనించిన స్థానికులు చంద్రశేఖర్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయం లోతుగా అవడం వల్ల అక్కడి నుంచి మరో కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ విషయం స్థానిక పోలీసులకు బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ రెడ్డిపై దాడి చేసింది స్థానిక తాడిపత్రి సెబ్ పోలీసులు అని తేలింది. స్మగ్లింగ్ చేసే ఓ వ్యక్తిని పట్టుకోబోయి పొరపాటున చంద్రశేఖర్ ను పట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
స్మగ్లర్ ను పట్టుకోబోయి..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన రామాంజనేయ రెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో ఉంటూనే గోవా లిక్కర్ ను అక్రమంగా సరఫరా చేస్తుంటాడు. అతడి నుంచి లిక్కర్ కొన్న ఓ నిందితుడు ఇటీవల తాడిపత్రి సెబ్ పోలీసులకు పట్టుబడగా.. రామాంజనేయ రెడ్డి పేరు బయటికి వచ్చింది. రామాంజనేయరెడ్డి చిరునామా తదితర వివరాలు కనుగొన్న పోలీసులు.. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఫోన్ నంబరుతో లొకేషన్ గుర్తించి పట్టుకోవాలని ప్లాన్ వేశారు.
దీంతో ఆ ఫోన్ లోకేషన్ నవంబర్ 21న ఉదయం జేఎన్‌టీయూ గ్రౌండ్ వద్ద ఉన్నట్లుగా చూపించింది. ఆ ప్రకారం సెబ్ పోలీసులు గ్రౌండ్ కి చేరుకొని ఇద్దరు సెబ్ కానిస్టేబుళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డిని చూసి రామాంజనేయరెడ్డిగా భావించారు. దీంతో గట్టిగా పట్టేసుకొని దాడి చేశారు. బాధితుడికి తీవ్రంగా గాయాలు కావడం చూసి భయపడిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి పారిపోయారు. లొకేషన్ తప్పుగా చూపించడంతో గందరగోళానికి గురై ఈ తప్పిదం జరిగిందని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనకు చింతిస్తున్నామని, విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.