Raghuveera Reddy Dance : అతను ఓ మాజీమంత్రి. సుదీర్ఘ రాజకీయ అనుభవం. మాటలతో మాయ చేయగల నేర్పరి. చేతలతో అభివృద్ధిని గ్రామ గ్రామానికి చేర్చగల దిట్ట. అనుభవాల పుట్ట. ఎత్తుకు పై ఎత్తులు వేసి శత్రువును చిత్తు చేయగల అపర మేధావి. ఎక్కడో కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మడకశిర నుంచి ఎదిగి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతగా ఎదిగారు మరి. ఆయనెవరో ఈపాటికి మీకు గుర్తువచ్చి ఉండొచ్చు. ఆయన మరెవరో కాదు. నీలకంఠాపురం రఘువీరారెడ్డి. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నాం అనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం.
ఉత్సాహంగా డ్యాన్సులు
తెల్లని ముతక పంచె నలిగిపోయిన అంగీ నెరిసిన గడ్డం తెల్లటి తువాలును పట్టుకొని నృత్యం చేస్తున్న వ్యక్తి మరెవరో కాదు రఘువీరారెడ్డె. ఒకప్పుడు డజను వాహనాల కాన్వాయ్ పది మంది దాకా సెక్యూరిటీ సిబ్బంది, ఆయన చుట్టూ అధికారగణం, హంగూ ఆర్భాటాలు ఇవన్నీ ఉండేవి. కానీ ఆయన తన జీవన శైలిని మార్చుకుని నీలకంఠపురంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా నీలకంఠాపురం గ్రామంలో నిర్వహించిన ఉత్సవాలలో గ్రామస్తులు, భక్తులతో కలిసి ఆయన ఈ విధంగా సాదాసీదా వ్యక్తిలా నృత్యం చేశారు. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అని మన పూర్వీకులు ఊరికే అన్నారా!
గ్రామోత్సవంలో చిందులేసిన రఘువీరా
సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం నూతనంగా నిర్మించిన దేవాలయాలలో శ్రీరామనవమి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా సాగుతున్నాయి. మూడురోజుల ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపులో మాజీ మంత్రి రఘువీరా స్థానిక గ్రామస్థులతో పాటు భక్తులను డ్రమ్ములు మోగిస్తూ, చిందులేస్తూ భక్తిపారవశ్యంతో హుషారెత్తించారు. అనంతరం సీతారాములస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా శ్రీరామ నవమి ఉత్సవాలు నిరాడబరంగా నిర్వహించారు. నేడు కరోనా మహమ్మారి నుంచి బయట పడటంతో సామూహిక వివాహలతో పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలయ ట్రస్టు చైర్మన్ మాజీ మంత్రి రఘువీరా తెలిపారు.