Kishan Reddy on Paddy Procurement : టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి వార్ రోజు రోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దిల్లీలో రైతు దీక్ష చేపట్టి కేంద్రం ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటమ్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. టీఆర్ఎస్ విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన... సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడాలన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రైతాంగాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రం విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టబోతోందని ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమాలు చేశారన్నారు. మీటర్లపై కేంద్రం జీవో కానీ చట్టం కానీ తీసుకురాలేదన్నారు. ఎరువులపై కేంద్రం సబ్సిడీ తీసేస్తుందని చేసిన ఆరోపణలను రైతుల నమ్మలేదన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రానికి ఉప్పుడు బియ్యం పంపించమని తెలంగాణ ప్రభుత్వమే ఒప్పందం చేసుకుందన్నారు.
బాయిల్డ్ రైస్ ఉచితంగా ఇచ్చినా తినట్లే
సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుల మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉప్పుడు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయన్నారు. గత మూడు నాలుగేళ్లుగా బాయిల్డ్ రైస్ వద్దని రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నాలు కేంద్రం చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకు ఎందుకన్నారు. ధాన్యంపై లేని సమస్యను ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ చూపిస్తోందని విమర్శించారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారన్నారు. బాయిల్డ్ రైస్‌ను ఎక్కడా వినియోగించడంలేదన్నారు. బాయిల్డ్ రైస్‌ను ఉచితంగా పంచినా ప్రజలు తినే పరిస్థితి లేదన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్‌సీఐ నిలిపివేసిందన్నారు. సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించి, వాస్తవాలను వక్రీకరించి ధర్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం
తెలంగాణ రైతు భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం చేతిలో నలిగిపోతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వేరువేరు విధానాలు లేవన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉందన్నారు. దేశంలో భూకంపం సృష్టిస్తామని కేసీఆర్ అంటున్నారు. టీఆర్ఎస్ లో భూకంపం రాకుండా చూసుకోండన్నారు. టీఆర్ఎస్ నేతలు పోటీలు పడి విమర్శిస్తున్నారన్నారు. గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని తెలంగాణ ఒప్పందం చేసుకుందన్నారు. గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్ రైస్‌ను రాష్ట్రం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి పంపలేదని కిషన్ రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుందన్నారు. రా రైస్‌గా ఇస్తే చివరి గింజ వరకూ కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రానికి రా రైస్ సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత నష్టం వస్తుందన్నారు. రైతుల కోసం కొద్ది నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేరా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ సీఎం కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నామన్నారు.