King Cobra Project : ప్రాజెక్ట్ కింగ్ కోబ్రా సక్సెస్ అయింది. అరుదైన కింగ్ కోబ్రా జాతి పాముల్ని కాపాడాలనే ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా పుట్టిన  25 కింగ్ కోబ్రా పాము పిల్లలను సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. విషపూరిత పాముల్లో అత్యంత పొడవుగా ఉండే కింగ్ కోబ్రాలు ఆహారంగా ఇతర పాములనే తింటాయి. ఎక్కువగా జెర్రి పోతులుగా  పిలువబడే ర్యాట్ స్నేక్ లను తినే కింగ్ కోబ్రాలు ఇతర పాముల్నీ తింటుంటాయి. ఒక్క కాటుతో  ఏనుగును సైతం చంపగలిగే విషం ఉండే ఈ పాములు నిజానికి మనుషుల కంట పడేందుకు ఇష్టపడవు. వీటి కాటుతో మనుషులు చనిపోయిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. అయితే అప్పుడప్పుడూ దారితప్పి జనావాసాల్లోకి వచ్చేస్తున్న కోబ్రాలను చంపేసేవారు. అయితే ఇటీవల గిరిజనుల్లో వీటిపై అవగాహన పెరిగింది. దీంతో కింగ్ కోబ్రాల సంరక్షణలో గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో కింగ్ కోబ్రా ప్రాజెక్టు చేపట్టారు.  గత 20 ఏళ్లుగా కింగ్ కోబ్రాల సంరక్షణ కోసం చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు మూర్తి కంఠి మహంతి అంటున్నారు. 



25 కింగ్ కోబ్రా పిల్లలు


జులై నెలలో అనకాపల్లి మండలంలో కృష్ణంపాలెం దగ్గర అడవిలో కింగ్ కోబ్రా గుడ్లను గమనించిన ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రతినిధులు వాటి సంరక్షణ బాధ్యతలు  చేపట్టారు. పాముల్లో గూడు కట్టేది ఒక్క కింగ్ కోబ్రా మాత్రమే. గుడ్లను పెట్టిన తర్వాత వాటిపై పాము చుట్టలు చుట్టుకుని నెలపాటు పొదుగుతుంది. ఆ సమయంలో అది ఎలాంటి ఆహరం తీసుకోదు.  అలాంటి పామును జూన్ నెల చివరిలో  గమనించిన కృష్ణంపాలెం గిరిజనులు EGWS సమాచారం ఇవ్వడంతో వారు అటవీ ప్రాంతానికి వెళ్లి కింగ్ కోబ్రా అక్కడి నుండి వెళ్లెవరకూ ఎదురు చూశారు. జులై నెల మధ్య వరకూ వేచిచూసి కింగ్ కోబ్రా గూడు విడిచి వెళ్లగానే.. గుడ్ల చుట్టూ దోమతెర కట్టి ఇతర జంతువులు అటువైపు రాకుండా కాపలా కాశారు. లేకుంటే ముంగిసలు ,ఉడుములు,పక్షులు, నక్కల వంటివి ఈ గుడ్లను తినేసే ప్రమాదముంటుందని మూర్తి తెలిపారు. నెలపాటు చేపట్టిన ఈ సంరక్షణ సత్ఫలితాలను ఇచ్చింది. ఆగస్టు 14న గూడులోని 32బి గుడ్లలో నుంచి 25 కింగ్ కోబ్రా పిల్లలు బయటకి వచ్చాయి. 7 గుడ్లు మాత్రం పాడయిపోయినట్టు గుర్తించారు. ఇవన్నీ క్షేమంగా అడవిలోకి వెళ్లిపోయాయి.  



ఫుడ్ చైన్ లో చాలా ముఖ్యం   


చూడడానికి భయంకరంగా కనిపించే కింగ్ కోబ్రాలు నిజానికి జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎలుకలను తింటూ రైతులకు వాటి సమస్యను పాములు తగ్గిస్తే పాములను తింటూ వాటి సంఖ్య మరీ మితిమీరిపోకుండా  కింగ్ కోబ్రాలు తమ వంతు పాత్ర పోషిస్తాయి . 14 నుంచి 18 అడుగుల పొడవు పెరిగే కింగ్ కోబ్రాలు 15 ఏళ్ల వరకూ జీవిస్తాయి . ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమల్లో ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలోని అడవుల్లో కనపడే కింగ్ కోబ్రాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం అని అంటున్నారు ఈస్టర్న్ ఘాట్ వైల్డ్ లైఫ్ సోసైటీ ప్రతినిధులు.