ACB Court News :   స్కిల్ స్కాంకేసులో సీఐడీ తనను అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ ఉన్న సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్‌పై గురువారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అరెస్టు చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువురిని ఫోన్‌ ద్వారా సంప్రదించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సీఐడీ కోర్టు దృష్టికి  తీసుకెళ్లారు.  ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని వాదించారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.                           


ఆ సమయంలో అధికారుల కాల్‌డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని అన్నారు. ఆ ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని సీఐడీ తరఫు న్యాయవాదులు కౌంటర్‌లో వివరించారు. అంతేకాదు.. అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని కూడా సీఐడీ పేర్కొంది. గురువారం నాడు సుమారు రెండు గంటల పాటు విచారణ జరగ్గా అనంతరం శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. 


స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కేసులో సెప్టెంబర్-08న అర్ధరాత్రి దాటాక చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఉన్న సీఐడీ అధికారుల సీడీఆర్‌(కాల్‌ డేటా రికార్డ్‌) కోరుతూ దాఖలైన పిటిషన్‌పై దాఖలు చేసింది. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన ఏసీబీ కోర్టు 26వ తేదీకి వాయిదా వేసింది. బాబును అరెస్టు చేసినప్పుడు 200 మంది వరకు సీఐడీ అధికారులు ఉన్నారని, వారి కాల్‌డేటాను కోర్టు అధీనంలో సంరక్షణలో ఉంచాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌ వేశారు.  దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ను న్యాయాధికారి   ఆదేశించారు. కౌంటర్‌ దాఖలుకు పీపీ ఈనెల 26 వరకు గడువు కోరడంతో అదే తేదీకి విచారణను వాయిదా వేశారు.                                 


చంద్రబాబును అరెస్ట్ చేయడంలో కుట్ర ఉందని.. కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా అరెస్టు చేశారని..  అందుకే ఆ కుట్ర గురించి బయటకు రావాలంటే కాల్ డేటా భద్రపరచాలని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చే నిర్ణయం కీలకం కానుంది. ఒక వేళ సీఐడీకి అనుకూలంగా తీర్పు వస్తే  కాల్ రికార్డులు తొలగించాలని టెలికాం కంపెనీలను సీఐడీ కోరే అవకాశం ఉంది. ఒక వేళ కాల్ రికార్డు  భద్రపరచాలని ఆదేశిస్తే.. అవి కోర్టు దగ్గర ఉంటాయి. తదుపరి విచారణలో కీలకమయ్యే అవకాశం ఉంటుంది.