జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆరు నెలలకోసారి రోడ్లపైకి వచ్చి పవన్ కల్యాణ్‌ చేసే రాజకీయాన్ని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను విమర్శించడమే పనన్ కల్యాణ్ పని అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన్నే విమర్శించేవారని గుర్తు చేశారు. 


జగన్‌ను, ఈ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే ఆరు నెలలకోసారి రోడ్లపైకి వస్తుంటారని పేర్ని నాని ఆరోపించారు. అమరావతిలోని వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన... జనం కోసం పది రోజులైనా పవన్ కల్యాణ్‌ పని చేశారా అని ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబును మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కల్యాణ్‌ను పేర్ని నాని నిలదీశారు. ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారని క్వశ్చన్ చేశారు. రిజర్వేషన్ అంశంపై వైసీపీ, జగన్ చాలా క్లారిటీతో ఉన్నారని... ఇది కేంద్రం పరిధిలోని అంశమని ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. కాపులను మోసం చేసిన చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్‌ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. 


పవన్ కల్యాణ్‌ సినిమాల్లో వంద కోట్లు దాటినవి ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు పేర్ని నాని. సినిమా బాగుంటే జనాలు చూస్తారని... లేకుంటే చూబోరని... భీమ్లానాయక్‌ విషయంలో ఇదే జరిగే ఉంటుందన్నారు పేర్ని నాని. దానికి భీమ్లానాయక్‌ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటు విమర్శలు చేయడం దేనికని ప్రశ్నించారు. వంద కోట్ల మార్కెట్ లేని పవన్ కల్యాణ్‌ సినిమాలకు 30 కోట్ల రూపాయల నష్టం ఎలా వస్తుందన్నారు. డబ్బింగ్‌, కాపీ సినిమాలు తీస్తే జనాలు చూడబోరని... డబ్బులు కూడా  రావని ఎద్దేవా చేశారు పేర్ని నాని.  
రాజకీయాల్లో కులం ప్రస్తావన తీసుకొచ్చిందే పవన్ కల్యాణ్ అని... ఆయన ప్రసంగాల్లో కులాల ప్రస్తావన లేకుండా మాట్లాడలేరన్నారు పేర్ని నాని. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేస్తారని ముందు నుంచి చెబుతున్నామని... అదే ఇప్పుడు కూడా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరూ ఎప్పుడూ ఒకటేనని చెప్పుకొచ్చారు. 


ఈ మధ్య పవన్ చేసిన కామెంట్స్‌పై అంబటి కూడా ఫైర్‌ అయ్యారు


పవన్ కాపులను కట్టకట్టి చంద్రబాబు దొడ్లో కట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇదంతా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాత్రమేనని తన నియోజకవర్గంలో మాత్రం కాపులు తనకు మాత్రమే ఓటు వేస్తారని అంబటి అంటున్నారు. పవన్ ప్రభావం తన నియోజకవర్గంలో మాత్రం ఉండే అవకాశం లేదని అన్నారు అంబటి. తన నియోజకవర్గంలోని కాపులంతా తన వెంటనే ఉన్నారని వ్యాఖ్యానించారు. కాపులను కేంద్రంగా చేసుకొని జనసేన అధినేత పవన్ చేస్తున్న రాజకీయంలో పవన్ అభిమానులు, బలి కాబోతున్నారని అన్నారు. పవన్ వ్యాఖ్యలతో ఆయన అభిమానులకు కనువిప్పు కావాలని అంబటి పిలుపునిచ్చారు. కాపు కులంలో ఉన్న వారంతా తమ కులానికి చెందని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించారని, అయితే పవన్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు పని చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని తాము ఎప్పటి నుండో చెబుతున్నామని పవన్ చేసిన వ్యాఖ్యలతో కాపులంతా ఆలోచించాలని అంబటి అన్నారు. తన నియోజకవర్గంలో తాను మాత్రం సేఫ్ అని అభిప్రాయపడ్డారు.