MLA Katasani Ramabhupal: వేలకోట్లు నిరూపిస్తే ఆస్తులన్నీ ఆ మీడియా అధినేతకు రాసిస్తా - వైసీపీ ఎమ్మెల్యే

ABP Desam   |  21 Feb 2024 05:08 PM (IST)

YSRCP News: టీడీపీని వ్యతిరేకించేవారిపై కట్టు కథనాలు రాయడాన్ని పత్రికాస్వేచ్ఛ అంటారా? అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నిలదీశారు.

కాటసాని రామభూపాల్ రెడ్డి

YSRCP Panyam MLA Katasani Ramabhupal Reddy: ఓ పత్రికా యజమానికి కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఛాలెంజ్ విసిరారు. ఆ పత్రిక టీడీపీ కరపత్రికగా మారిపోయిందని ఆరోపించారు. టీడీపీని వ్యతిరేకించేవారిపై కట్టు కథనాలు రాయడాన్ని పత్రికాస్వేచ్ఛ అంటారా? అని నిలదీశారు. పత్రికను అడ్డంపెట్టుకుని వ్యక్తుల్ని టార్గెట్‌ చేస్తున్న సదరు పత్రికా యజమాని వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. అబద్ధాల్ని నిస్సిగ్గుగా రాశారని.. ఆయనకు నిజాల్ని చెప్పే ధైర్యం లేదా? అంటూ మాట్లాడారు. తప్పుడు కథనాలపై నిరసన తెలిపే హక్కు తమకు ఉందని అన్నారు. జర్నలిజంపై దాడిని తాము సమర్ధించబోమని.. కానీ, తప్పుడు రాతలు రాసిన ఈనాడు వైఖరిపై నిరసన తెలిపితే.. దాడి అని ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘ఆ పత్రికలో తామేదో కబ్జాలకు పాల్పడుతున్నామని.. భూములు ఆక్రమించుకుంటున్నానని తాటికాయంత అక్షరాలతో కథనం రాసుకున్నారు. రాజకీయంగా నేనున్నాను గనుక నన్ను టార్గెట్‌ చేసి నామీద అవాస్తవాలు రాసినా పెద్దగా ఫీల్‌ కాలేదు. అయితే, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నా కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుడు రాతలు రాయడం చాలా బాధాకరం. నాకు తెలిసినంత వరకు నేనేరోజూ ఆ దినపత్రికగా గుర్తించ లేదు. తెలుగుదేశం కరపత్రంగా దాన్ని గుర్తిస్తాను.

నీ భార్య, కోడలు గురించి దుష్ప్రచారం చేస్తే ఊరుకుంటావా?మీ ఇంట్లో మీ భార్యకో.. కోడలికో.. సంబంధం లేని విషయాల్ని అంటగట్టి దుష్ప్రచారం చేస్తే.. మీరు చూస్తూ ఊరుకోగలరా..?- నేను 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఆనాటి నుంచి ఈనాటి వరకూ నా భార్య బయటకొచ్చి రాజకీయంగా మాట్లాడటం.. ఇన్వాల్వ్‌ అవడం మీరెవరైనా చూశారా? కేవలం, ఎన్నికల సమయంలోనే ఇంటింటి ప్రచారం తప్ప ఆమె ఏనాడూ రాజకీయ ప్రస్తావనల్లో తలదూర్చలేదు. అలాంటి గృహిణిగా ఉన్న నా భార్య గురించి సెటిల్‌మెంట్‌లు చేస్తున్నట్లు మీ పత్రికలో ఎలా రాస్తారు? మీకు దమ్ముంటే మీరు రాసిన వార్తాకథనానికి సంబంధించిన ఆధారాలతో చర్చించేందుకు ముందుకు రండి. 

‘‘రియల్‌ ఎస్టేట్‌దార్లు వెంచర్లు వేసినప్పుడల్లా 10 శాతం కమీషన్‌ నాకిస్తున్నట్లు మీరు రాశారు గదా..? ఎవరికీ తెలియని కొత్త సంస్కృతిని మీరు నేర్పుతున్నారా..? నిజంగా, మీ దగ్గర నాకు కమీషన్లు ఇచ్చినట్లు ఆధారాలున్నా.. వాటిని బయటపెట్టడం గానీ.. లేదంటే, కమీషన్లు ఇచ్చామని చెప్పే రియల్టర్లను గానీ మా ముందుకు తెచ్చి రుజువు చేయించగలరా..? ఇలాంటి ఆరోపణలతోనే నామీద గతంలోనూ రెండు సార్లు అవాస్తవాల్ని ప్రచారం చేశారు.

నిరసన తెలిపితే.. దాడి ఎలా అవుతుంది..?పత్రికా కార్యాలయంపై నిజంగా దాడి జరిగితే.. దాన్ని మేమూ సమర్ధించబోం. నిన్న గడివేములలో జరిగిన వాలంటీర్‌ వందనం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన సమయంలో మా కార్యకర్తలు కర్నూలు పత్రికా కార్యాలయం ముందు నిరసన ధర్నా చేశారంట. వారి నాయకుడి మీద.. ఆ నాయకుని కుటుంబం మీద లేనిపోని అబద్ధాలు అల్లి వార్తలు వచ్చినప్పుడు ఆమాత్రం ‘నిరసన చేసే హక్కు’ కూడా వారికి లేదనుకుంటారా..? దాన్ని దాడిగా ఎలా చిత్రీకరిస్తున్నారు..? 

నిరూపిస్తే.. నా ఆస్తులు రాసిస్తా.. ఇదే నా ఛాలెంజ్

నేను గానీ.. నా కుటుంబ సభ్యులు గానీ ఎక్కడైనా సెంటు భూమిని కబ్జా చేశామన్నా.. ఎవరి ఆస్తినైనా అక్రమంగా ఆక్రమించుకున్నామని మీరు ఆధారాలతో నిరూపిస్తే నా ఆస్తులు రాసిస్తా.. ఇదే నా ఛాలెంజ్‌. రాజకీయంగా ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. అంతేగానీ.. పత్రికలు, టీవీల్లో మాపై దాడి చేసి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం మేం ఊరుకునేదిలేదు. సదరు పత్రిక రాసిన కథనాన్ని నిజమని నిరూపిస్తే.. ఆ వెయ్యికోట్ల విలువైన ఆస్తులన్నీ ఆ పత్రికా యజమానికో.. ఆయన పత్రికా సంస్థకో రాసివ్వడానికి నేను సిద్ధం. నా సవాల్‌ను స్వీకరించే దమ్మూధైర్యం ఆయనకు ఉందా? అని నిలదీస్తున్నాను- ఎమ్మెల్యే కాటసాని

Published at: 21 Feb 2024 05:08 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.