ఎన్నికలకు రెండేళ్లు ఉండగానే పొత్తుల అంశం ఎందుకు తెరపైకి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా అధికారం కోసమే వీళ్లంతా మళ్లీ కలిసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పొత్తులు సర్వసాధారణమే అయినా... వీళ్ల మధ్య ఉన్న భావసారూప్యత ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల టైంలో, కులాల లెక్కలు వేసుకొని పొత్తులు పెట్టుకోవడం ఏంటని నిలదీశారు.
ఇప్పటి నుంచి ప్రజలను, కార్యకర్తలను సిద్ధం చేయడానికి పొత్తు అంశంపై ఫీలర్‌లు వదులుతున్నారని ఎద్దేవా చేశారు సజ్జల. పొత్తులపై విషయంలో మూడు పార్టీలు చేస్తున్న కామెంట్స్ విరుద్దంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు త్యాగాలకు సిద్ధమని ప్రకటిస్తే... రాబోయేది తమ ప్రభుత్వమేనని పవన్ కామెంట్స్ చేస్తున్నారని... బీజేపీ మాత్రం వాళ్లతో తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యాఖ్యానిస్తోందన్ననారు. అయితే ఎవరు ఏం త్యాగం చేస్తారో ప్రజలకు వివరించాలని సూచించారు. సీఎం పదవిని చంద్రబాబు త్యాగం చేస్తారా... పవన్ త్యాగం చేస్తారా అని ప్రశ్నించారు. లేకుంటే ఒకే రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఎలా ఉంటారో అదైనా వివరించాలన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి చెబుతున్నట్టుగా చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్ నడుస్తున్నారని విమర్శించారు సజ్జల. ఆయన చేపట్టే కార్యక్రమాలకు పర్యవేక్షణ, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదేనన్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కౌలు రైతులకు సహాయ కార్యక్రమం కూడా ఇలాంటిదేనని... అలా వెళ్లి అక్కడేదో కామెంట్ చేసి నాలుగు రోజులు వార్తల్లో ఉండి తర్వాత రెస్ట్ తీసుకుంటారని పవన్ కల్యాణ్‌పై విమర్సలు చేశారు సజ్జల.
చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు దేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది లేదని... ఇప్పుడు పొత్తులతో వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. అడ్డగోలుగా ఎన్నిసార్లు ఆయన జంపింగ్‌లు చేశారో ప్రజలు స్పష్టంగా చూశారని... ఇప్పుడు మరోసారి అదే దారిలో వెళ్తున్నారన్నారు.
ప్రజల మనసులు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు ఒంటరిగా అయితేనే మేలని వైసీపీ ఎప్పుడూ పొత్తులకు దూరంగా ఉందన్నారు సజ్జల. టీడీపీ, జనసేనకు జనం అంటే చులకన కాబట్టే ఇలాంటి ఎత్తుగడలతో ప్రభుత్వ ఓటు చీలిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారన్నారు. పొత్తు పెట్టుకోకపోవడమే పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారు సజ్జల.
ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ వైబ్ ఉందని.. దింపుడు కళ్లెం ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు సజ్జల. వాళ్ల కడుపు మంట చూస్తేనే జగన్ పాలన ఎలా ఉందో అర్ధమైపోతుందన్నారు. ఐదు కోట్ల మందిని చంద్రబాబు, పవన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. రిజెక్ట్ చేసినా బరితెగించి మళ్లీ పని చేస్తున్నారు. ఎక్కడో జరిగిన ఒకట్రెండు సంఘటనలను బూచిగా చూపించి ప్రజల్లో భయభ్రాంతులు కలిగిస్తున్నారని ఆరోపించారు.