మేనమామ, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అంటే తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు కోపం అని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మేనమామ కేసీఆర్, బావమరిది కేటీఆర్ పై ఈర్ష్యతోనే ఏపీపై హరీష్ రావు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.


‘‘హరీష్ రావుకు మేనమామ మీద, బావ మీద కోపం, ఈర్ష్య ఉంది. హరీష్ రావు బాధపడలేకే కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టి పనిష్మెంట్ వేశారు. 2018లో హరీష్ రావు కేసీఆర్ కెబినెట్లో ఎందుకు లేరు? హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవుతున్నారు. హరీష్ రావు సర్టిఫికెట్లు కాటాకేస్తే.. ఉల్లిపాయలు కూడా రావు. హరీష్ రావు సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు. మమ్మల్ని విమర్శిస్తే మేం తిరిగి కేసీఆరును విమర్శిస్తామని హరీష్ రావు ఆలోచన. మేం కేసీఆర్ ను విమర్శిస్తే హరీష్ రావు సంతోషించాలని అనుకుంటున్నారు. మళ్లీ హరీష్ రావు మమ్మల్ని విమర్శిస్తే ఆ ఉబలాటం తీర్చేస్తాం. కేసీఆర్ అల్లుడు గిల్లుడు చూస్తూ ఊరుకుంటే.. మేం కేసీఆర్ ని విమర్శిస్తాం’’ అని పేర్ని నాని అన్నారు.


ఎన్ని జన్మలు ఎత్తినా గెలవరు - పేర్ని నాని


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎన్ని జన్మలు ఎత్తినా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెల్చుకోలేదని పేర్ని నాని తేల్చిచెప్పారు. కర్ణాటకలో మొన్నటి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఆ పార్టీకి తెడ్డు కాల్చి వాత పెట్టారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కర్నూలులో హైకోర్టు పెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని.. ఆ హామీని టీడీపీ హయాంలో ఎందుకు అమలు చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. అమరావతిలో జరిగిన పాపాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. ఎంపీలు సీఎం రమేష్‌, సత్యకుమార్‌, సుజనా చౌదరి మాటలను నడ్డా తన బుర్రలో ఎక్కించుకుని మాట్లాడితే అది వారి కర్మ అంటూ మాట్లాడారు.


భూ కుంభకోణానికి పాల్పడింది ఏపీలో గతంలో అధికారంలో ఉన్న పార్టీనే అని, దానికి బీజేపీ కూడా మద్దతు పలికిందని ఆరోపించారు. విశాఖ ఉక్కును అమ్మేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనక కూడా ల్యాండ్ స్కామ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఏలుబడిలో ప్రైవేటు వ్యక్తులకు గానీ, సంస్థలకు గానీ ప్రభుత్వ భూములను అమ్మలేదని చెప్పారు. క్యాప్టివ్ మైన్స్ ను అదానీతో పాటు కొన్ని సంస్థలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కట్టబెట్టిందని పేర్ని నాని విమర్శించారు.


‘‘అమరావతి రాజధాని నిర్మాణం కోసం డబ్బులిస్తే చంద్రబాబు దోచేశారని గతంలో మీరే చెప్పారు. ఇసుక ఫ్రీ అంటూ టీడీపీ, బీజేపీ పెద్దలు దోచుకున్నారు. మీ ప్రభుత్వంలో రూ.4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలి. మా ప్రభుత్వ చర్యలతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు రేట్లు పెంచాం. గత టీడీపీ ప్రభుత్వం లిక్కర్‌ షాపులను ఇద్దరికే కట్టబెట్టింది. లిక్కర్‌ సిండికేట్‌ను దందాగా నడిపింది మీరే కదా?’’ అని పేర్ని నాని మాట్లాడారు.