Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైఎస్‌ఆర్‌సీపీ తీవ్ర నైరాశ్యంలో కూరుపోయి ఉంది. భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తామన్న అంచనాలను తలకిందులయ్యే సరికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తోంది. వారిలో ఉన్న బాధ పోగొట్టేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలతోపాటు, ఓడిపోయిన అభ్యర్థులతో కూడా సమీక్షలు జరిపారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా అందరితో మాట్లాడుతున్నారు.
గతం కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అధినేత నుంచి అంతా చెప్పుకుంటూ వచ్చారు. పార్టీ పరంగా చేసిన సర్వేల్లో కూడా ఇదే స్పష్టమైందని... కానీ ఆఖరి నిమిషంలో ఏ జరిగిందో మాత్రం తెలియదని ఘోరంగా 11 సీట్లు రావడంపై అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ వర్గాలు చేసిన మేలు, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పనులు గెలిపించలేదంటే నమ్మశక్యం కావడం లేదని సమీక్షల్లో నేతలు వాపోతున్నారు. ఈవీఎంలపై కూడా జగన్‌తోపాటు అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినందున ఇప్పుడు ఎన్ని చర్చలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రయోజనం లేదని గ్రహించిన వైసీపీ రియాల్టీలోకి వస్తోంది. ఎక్కడ లోపం ఉందో గ్రహించి అందుకు అనుగుణంగా పని చేయాలని నిర్ణయించింది. అంతకంటే ముందుగా పార్టీ నేతలు, కేడర్ నిరుత్సాహ పడకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పార్టీ ఓడిపోయి బాధలో ఉంటే ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని జగన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో నేతలపై, పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని తీవ్రమైన ఒత్తిడి ఉందని వాపోతున్నారు. ఈ విషయంపై పోరాటానికి సిద్ధమైన వైసీపీ, కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో కూడా గవర్నర్‌కు లేఖలు రాసింది. అవసరం అయితే న్యాయపోరాటానికి సిద్ధమంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఓ వైపు ఈ పోరాటం కొనసాగిస్తూనే పార్టీ కేడర్‌కు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలని వాళ్లకు ధైర్యం చెప్పాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం తర్వాత జనంలోకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. ఎన్నికల నాటి నుంచి వివిధ ఘటనల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించనున్నారు.
కేవలం ఇది పార్టీ పరమైన పర్యటనగా చేస్తారా లేకుంటే ప్రజలతో కూడా కలుస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ పర్యటనలోమండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి లీడర్లతో సమావేశమవుతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. నిత్యం ప్రజల్లో ఉండాలని ప్రభుత్వం చేస్తున్న తప్పులపై నిలదీస్తూ ఉండాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పెట్టినప్పుడు జీరో నుంచి ప్రారంభమయ్యామని... ఇకపై 11తో ప్రారంభంకావాలనే విషయాన్ని వాళ్లకు స్పష్టం చేయనున్నారు.
ఎమ్మెల్సీలతో ఇవాళ మాట్లాడిన జగన్... సమయం కోసం వేచి చూడాలన్నారు. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలను టచ్ చేసి చంద్రబాబు మొదటి తప్పు చేశారని... ప్రత్యేక హోదాను పట్టించుకోకుండా కేంద్రంతో అధికారం పంచుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాకుంటే ఏ యువకుడికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికీ వైసీపీ చేసిన మంచి అందరికీ గుర్తు ఉందని అన్నారు. ఇలా చంద్రబాబు తప్పుులు చేసుకుంటూ వెళ్తే కచ్చితంగా పోరాటాలు చేయాల్సి వస్తుందని దిశానిర్దేశం చేశారు.