Kadapa Latest News: జగన్ మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ "YSR తాడిగడప మున్సిపాలిటీ " పేరులోని YSR పేరును తొలగించింది కూటమి ప్రభుత్వం. ఆ మేరకు ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. విజయవాడ సమీపంలోని తాడిగడప మున్సిపాలిటీ రెవెన్యూపరంగా రియల్ ఎస్టేట్ పరంగా, విద్యాసంస్థల పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ విజయవాడలో కలిసిపోయిన ఏరియా ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తాడిగడప దాని చుట్టుపక్కల పంచాయతీలను కలిపి తాడిగడప మున్సిపాలిటీగా మార్చారు. అయితే ఆ సమయంలో తాడిగడప మున్సిపాలిటీకి ముందు దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి పేరు చేరుస్తూ "వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ " అని ఏర్పరిచారు. దీనిపై తాడిగడప ప్రజల నుంచి అప్పట్లోనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. తాడిగడపకి ఎలాంటి సంబంధం లేని YSR పేరును ఇక్కడ పెట్టడం ఏంటి అంటూ స్థానిక ప్రజలు వ్యతిరేకించినా జగన్ ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు.
YSR పేరు తొలగించిన కూటమి ప్రభుత్వం
2024 ఎన్నికల్లో గెలిచి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి YSR తాడిగడప మునిసిపాలిటీ" పేరును "తాడిగడప మునిసిపాలిటీ"గా మార్చాలంటూ డిమాండ్స్ ఎక్కువయ్యాయి. దానితో ఏపీ క్యాబినెట్ YSR పేరు తొలగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీల చట్టం, 1965 షెడ్యూల్ X కాలమ్ 2లో No.1 ను సవరించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెల్పింది.
కడప జిల్లా పేరు కూడా
ఒకప్పటి "దేవుని గడప" పేరు మీదుగా ఏర్పడిన కడప జిల్లాను వైఎస్సార్ మరణాంతరం వైఎస్సార్ కడప జిల్లాగా మార్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పేరులోని కడపను తొలగించి కేవలం "వైఎస్సార్ జిల్లా" గానే కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వై.ఎస్.ఆర్. జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనకు కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. దానితో ఒకేరోజు వైఎస్సార్ జిల్లాకు కడప పేరును చేర్చడం, తాడిగడప మున్సిపాలిటీ పేరులోనుండి వైఎస్సార్‌ను తొలగించడం వంటి రెండు కీలక నిర్ణయాలకు ఏపీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.