నవ్యాంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన మంగళవారంతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకుని 2023 మే 30న ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు.
నాలుగేళ్ళ రిపోర్ట్...
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ఊహించని విజయం సాధించింది. 151 సీట్లతో పెద్ద ఎత్తున ప్రజాదరణ కలిగిన పార్టిగా అవతరించింది. ఈ నాలుగేళ్లలో దాదాపు ఐదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో అంటే–1953 అక్టోబర్‌ 1–1956 అక్టోబర్‌ 31 మధ్యన (నాటి ఆంధ్ర రాష్ట్రంలో) గానీ, లేదా 1956 నవంబర్‌ 1–2014 జూన్‌ 1 మధ్యన (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో) గాని కనిపించని ప్రభుత్వ జన సంక్షేమ పథకాలను,  ప్రగతిని స్వయంగా పరిచయం చేసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పేద ప్రజలు, బలహీనవర్గాల అభివృద్ధికి పెద్దపీఠ వేసి అన్ని వర్గాల ప్రజలు చేయీచేయి కలిపి ముందుకు సాగడానికి వైఎస్సార్ సీపీ సర్కారు 2019 మే 30 నుంచీ నిజాయితీగా చేసిన ప్రయత్నాలకు ప్రజలే ప్రత్యక్ష సాక్షులని అంటున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004–2009 మధ్య జననేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాలనలో మాత్రమే రాష్ట్ర సర్కారు ఇలాంటి ప్రజా సంక్షేమానికి అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేసిందని, 2014–2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన సాగిన ఐదేళ్ల పాలనతో కుదేలైన ఏపీ ప్రజానీకాన్ని ఆదుకోవడానికి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచే జగన్‌ ప్రజాసేవకు అంకితమయ్యారని పార్టి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రమాణ స్వీకార వేదికపైనే వృద్ధ్యాప్య పింఛన్లను పెంచుతూ ఫైలుపై సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలా మొదలైన పరిపాలనలో ఇప్పటికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కారు తన ఎన్నికల వాగ్దానపత్రంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిందని అంటున్నారు.
టార్గెట్ 175....
రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 175 గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్న జగన్‌ ఇచ్చిన పిలుపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పాలకపక్షానికి ప్రజల అనుకూల స్థితిని ప్రతిబింబిస్తున్నాయని, పాలకపక్షంపై ప్రజల్లో అసంతృప్తి లేనే లేదంటున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వమైనా ప్రజల్లో వ్యతిరేకతను, అసంతృప్తిని ఎదుర్కొంటుంది. కానీ, ఏపీలో 4 సంవత్సరాల జగన్ సర్కారు పాలనపై జనామోదం నిరంతరం వ్యక్తమౌతూనే ఉందని పార్టి శ్రేణులు అంటున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో, శాసనమండలికి జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో జనం తమ పాలకపక్షానికి నీరాజనం పట్టారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో జయాపజయాలపై కన్నా అన్ని వృత్తులు, రంగాల్లో ఉన్న ప్రజల ఆయురారోగ్యాలకే ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న పథకాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయని చెబుతున్నారు. 
అవినీతి లేని సంక్షేమం...!
సంక్షేమ పథకాలను నగదు బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడం వల్ల అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్షలాది కోట్ల రూపాయల సహాయం ఆంధ్ర ప్రజానీకానికి ఇంత సాఫీగా అందడం వైఎస్సార్సీపీ హయాంలోనే మొదటిసారిగా చెబుతున్నారు. ప్రతిపక్షాల అభాండాలను, అడ్డంకులను విజయవంతంగా అధిగమిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రగతిపథంలో ముందుకు సాగడం దేశంలోనే అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అంటున్నారు. అనేక రాష్ట్రాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాలను, వాటి అమలు తీరును అధ్యయనం చేయడానికి రావడం రాష్ట్రానికే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
కొత్త పథకాలకు రూపం ఇస్తూ, మరోసారి అధికారంలోకి రావడానికి పార్టీ నిరంతరం కృషి చేస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్యన తిరగడమేగాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లతో సేవలందించడం తమకు ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ ఇచ్చిన టార్గెట్ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 175 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో భారీగా బైక్ ర్యాలీలకు వైసీపీ శ్రేణులు రెడీ అవుతున్నాయి.