Recalling Chandra Babu Manifest: జూన్ రెండు నుంచి అన్ని పథకాలు అమలు చేస్తానంటూ హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబును బాకీలు వసూలు చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. ఇంటికి టీడీపీ నేతలు వచ్చినప్పుడు గతంలో ఇచ్చిన హామీలు, ఎన్నికల మేనిఫెస్టోను చూపించి నిలదీయాలని పిలుపునిచ్చారు. గత జూన్ నుంచి ఇవ్వాల్సిన పథకాలను వడ్డీతోపాటు ఇచ్చేలా ఒత్తిడి చేయాలన్నారు. 

ఆంధ్రప్రదేశ్ సంపదను తన జేబులోకి, తన అనుచరుల జేబులోకి చేరుతోందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. వచ్చి ఏడాది అయిన తర్వాత ప్రజలకు ఖర్చు పెట్టింది లేదని విమర్శించారు. చేసిన అప్పులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. కేంద్రం సంస్థలు ప్రకటించిన ఏ లెక్కలు చూసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని లెక్కలతో వివరించారు. ఇలాంటివి అడుగుతుంటే కేసులు పెడుతున్నారని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌లో జగన్ ప్రెస్‌మీట్ పట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోపాటు ఆయనకు సపోర్ట్ చేసే మీడియాతో పోట్లాడుతున్నామని అన్నారు జగన్. రాష్ట్రంలో రోజురోజుకు లాండ్ ఆర్డర్ దిగజారిపోతుందని, పాలన పూర్తిగా దారి తప్పిందని ఆరోపించారు. అందుకు పల్నాడులో జరిగిన ఘటనలే ఉదాహరణలు అని అన్నారు. కూటమి ప్రభుత్వ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే అడుగడుగునా అడ్డుకున్నారని మండిపడ్డారు. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్యే తన పర్యటన సాగిందని చెప్పుకొచ్చారు. తన టూర్‌లో పాల్గొన్న వారిని బెదిరించేందుకు కేసులు పెడుతున్నారని అన్నారు. పొదిలి పర్యటన సందర్భంగా కూడా హంగామా చేశారని తమపై రాళ్లు వేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు ప్లే చేస్తూ విమర్శలు చేశారు జగన్. ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తారని అంటున్నారని నాలుక మందం అంటూ ఎటకారం చేస్తున్నారని అన్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.  

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు కానీ వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి వైసీపీ శ్రేణులు, సానుభూతిపరులపై కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి గన్‌మెన్‌ను బెదిరించి ఆయన్ని అరెస్టు చేశారన్నారు. దీనిపై గన్‌మెన్‌ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీలకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. చెవిరెడ్డితోపాటు ఆయన కుమారుడు, పిన్నెల్లిని, నందిగం సురేష్‌, ఆయన భార్య, జోగి రమేష్, ఆయన కుమారుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలా చాలా మందిని టార్గెట్ చేశారని అన్నారు. ఏ పాపం తెలియని కొమ్మినేనిని కూడా అరెస్టు చేశారని ఆరోపించారు. డిబెట్‌లో ఎవరో చేసిన కామెంట్స్‌కు కొమ్మినేని ఎలా బాధ్యుడు అవుతారని ప్రశ్నించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఆయనకు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇది చంద్రబాబుకు చెంపపెట్టులాంటిదని అభిప్రాయపడ్డారు.