Youtuber Prashna Ravan Arrest | అమరావతి: వరుస అరెస్టులు, పోలీసు నిర్బంధాలపై యూట్యూబర్ ప్రశ్న రావణ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఒక కేసులో తనకు నాలుగో బెయిల్ వచ్చిన వెంటనే, వేంపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు ఐదోసారి తనను అరెస్టు చేసి నక్కపల్లికి తరలిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాదె సాయికృష్ణ తరహాలో తనను కూడా పోలీస్ స్టేషన్‌లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ అయిన సందర్భంగా ప్రశ్న రావణ్ మాట్లాడుతూ, తన గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోందని, కానీ ఒక మనిషి (ప్రశ్న రావణ్)ని చంపగలరేమో కానీ, ప్రజల్లో ప్రశ్నించే స్వభావాన్ని, ప్రశ్నల్ని ఎవరూ చంపలేరని ప్రభుత్వానికి ఘాటుగా సమాధానమిచ్చారు.
కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు 500 మంది పోలీసులు..
రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉంటే వాటిని గాలికొదిలేసి, ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు సుమారు 500 మంది పోలీసులు తిండి తిప్పలు వదిలేసి తన వెంటే తిరుగుతుండటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తాను ఎటువంటి దొమ్మీలు, దౌర్జన్యాలు చేయలేదని, అత్యాచారాలు చేయలేదన్న యూట్యూబర్ రావణ్.. కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించడమే తాను చేసిన నేరమా? అని నిలదీశారు. గత నాలుగు రోజులుగా తాను ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని, వ్యవస్థ మొత్తాన్ని ఒక మనిషి కోసం ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
రాష్ట్ర చరిత్రలో 4 రోజుల్లో నాలుగు అరెస్టులు, బెయిల్స్ రావడం తొలిసారి అని, అయినా మరో కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. జనసేన నియోజకవర్గాలకు తాను వెళ్తే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరుగుతున్నాయని, అంటే నన్ను చంపడమే మీ లక్ష్యమా అని ప్రశ్నించారు.
వేధించే బదులు నేరుగా పీఎస్‌లోనే చంపేయండి..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ విధంగా తనను మానసికంగా, శారీరకంగా వేధించే బదులు నేరుగా పోలీస్ స్టేషన్‌లోనే చంపేయాలని ఆయన సవాలు విసిరారు. తాను వెళ్ళిన చోటల్లా వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయని, కొందరు గూండాలు తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుగాలి ప్రీతి వంటి సంచలన కేసుల్లో బాధితులకు కనీసం న్యాయం చేయలేని ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న తనపై నాన్-బైలబుల్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపాలని చూడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఒక పౌరుడిగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని, ఈ నిర్బంధాలకు భయపడకుండా తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు చేసి శుక్రవారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ప్రాధేయపడటంతో న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. న్యాయాధికారి బాలా త్రిపుర సుందరి రావణ్‌కు బెయిల్ మంజూరు చేశారు. అయితే, బెయిల్ పొంది బయటకు వచ్చిన వెంటనే, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను వేరే పాత కేసులో తిరిగి అదుపులోకి తీసుకున్నారు. శనివారం బెయిల్ మీద విడుదల కాగానే, మరో కేసులో పోలీసులు రావణ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దుమారం రేపుతోంది.
