వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి, వైయస్సార్ పేరు పెట్టడం సబబు కాదని రాజ్యసభ మాజీ ఎంపీ, ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధం కారణంగా ప్రస్తుతం తాను ఉన్న మూడు పదవులకు రాజీనామా చేసానని చెప్పారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చిన రోజే తన రాజీనామా పత్రాలు అధికారులకు పంపానని చెప్పారు. నిన్న ఒక దిన పత్రికలో స్వరం మార్చిన యార్లగడ్డ అని వార్త ఇచ్చారని, ఆ పత్రిక యజమాన్యానికి లేఖ ద్వారా స్వరం మార్చలేదు, రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని తెలియజేసినట్లుగా చెప్పారు. మంగళవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.


భాషాభివృద్ధికి పదవే అవసరం లేదని, పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పత్రికా యాజమాన్యానికి లేఖ రాశాక ఇవాళ సవరణ అని వార్త ఇస్తారనుకున్నానని, కానీ సవరణ ఇవ్వకుండా తిడుతున్నట్లు మరో వార్త ఇచ్చారని చెప్పారు. రాజీనామా చేసి జగన్ ను తిడుతున్నారెందుకు అని అమెరికా నుంచి కూడా అడుగుతున్నారని తెలిపారు. తాను ఎప్పుడూ జగన్ ను పల్లెత్తు మాట అనలేదని చెప్పారు. ‘‘మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్పాను. పేరు మార్చడం నచ్చలేదు, రాజీనామా చేసి బయటకు వచ్చేసా. రాజీనామాపై వెనుకడుగు వేసేది లేదు. మళ్లీ తీసుకోమన్నా.. నేను వద్దనే చెబుతాను’’ అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తేల్చి చెప్పారు.


లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలపైనా స్పందన
లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు ఆమె ఇష్టమని, ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఏపీలో రాజధానికి ఎన్టీఆర్‌ పేరు వచ్చేలా పెట్టాలని తాను ఎప్పుడో చెప్పినట్లు గుర్తు చేశారు. ఆనాటి‌ ప్రభుత్వం అమరావతి అని పేరు పెట్టిందని, దేవేంద్రుడి రాజధాని అమరావతి. కాబట్టి ఆ పేరు ఏపీకి ఎందుకని ప్రశ్నించారు. తాను మాట మార్చలేదు.. నిర్ణయం మార్చుకోలేదని అన్నారు. ఇంకా తన తీరుపై ఏవైనా సందేహాలు ఉంటే తన నంబర్ 98490 67343కి కాల్ చేస్తే అన్ని ఆధారాలు ఇస్తానని చెప్పారు. తనపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని కోరారు.


ఎన్టీఆర్ పేరు మార్చడం నిరసిస్తూ రాజీనామా
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన రోజే యార్లగడ్డ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందని, ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుకు ఏనాడూ గౌరవం లేదని అన్నారు. చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొన్న సందర్భం నిజమని అన్నారు.


తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీని కాంగ్రెస్త్ పొత్తు పెట్టుకున్నారని.. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం చంద్రబాబు ఉత్తుత్తి లెటర్లు రాశారన్నారు యార్లగడ్డ. ఎన్టీఆర్‌కు అప్పటి ప్రధాని వాజ్‌పేయి భారత రత్న ఇస్తానంటే చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. భారత రత్నను లక్ష్మీ పారత్వి తీసుకుంటుంది కాబట్టి వద్దన్నారని.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు కేంద్రం అనుమతిచ్చింది అన్నారు. చంద్రబాబు ఆ పేరు పెట్టకుండా కుట్ర పన్నారన్నారు.