Vahana Mitra: ఆంధ్రప్రదేశ్‌లో అటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురంలో ప్రకటించారు. ఈ దసరా నుంచే ప్రతి ఆటో డ్రైవర్‌కు డబ్బులు ఇస్తామని వెల్లడించారు. దీంతో అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది... ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందనే విషయంలో చర్చ మొదలైంది. అధికారులు కూడా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆటోలకు గిరాకీ లేక ఇబ్బంది పడుతున్నట్టు చాలా ప్రాంతాల్లో డ్రైవర్లు నిరసన చేపట్టారు. తమ గురించి కూడా ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాహన మిత్ర అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అటో డ్రైవర్ల డిమాండ్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించిన ప్రభుత్వం వాహన మిత్ర అమలు ఈ దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ సీక్రెట్‌గా ఉంచారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రకటించాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే అనంతపురం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకంపై ప్రకటన చేశారు. ఉచిత బస్ ప్రయాణ పథకం స్త్రీశక్తి వల్ల ఇబ్బందిపడ్డ ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఏటా 15వేలు ఇస్తామని వెల్లడించారు. ఆ పథకాన్ని ఈ దసరా నుంచే ప్రారంభిస్తున్నట్టు కూడా వెల్లడించారు.
వాహనమిత్ర పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసిన వెంటనే రవాణా శాఖాధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సొంత క్యాబ్‌లు, ఆటోలు, మ్యాక్సీక్యాబ్‌లు ఉన్న వారి వివరాలు సేకరించారు. ఇలాంటి వారు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. ఇందులో ఆటో డ్రైవర్లే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లందరికీ పథకాన్ని అమలు చేయాలని చూస్తే దాదాపు ఐదు వందల కోట్లు నిధులు అవసరం అవుతాయి. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను సిద్ధం చేశారు.
ఎవరు అర్హులు సొంత వాహనం కలిగి డ్రైవింగ్ చేస్తున్న వాళ్లు మాత్రమే అర్హులు. ఒకటి కంటే ఎక్కువ ఆటోలు, క్యాబ్‌లు ఉన్నా సరే ఒకదానికి వర్తింపజేస్తారు. ఆటో యజమాని, డ్రైవర్ ఒకరే అయ్యి ఉన్న వాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ఏం కావాలివాహనం ఆర్సీ బుక్, లైసెన్స్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలను రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఎవరు అర్హులు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఏం కావాలనే విషయాలపై క్లారిటీ ఇవ్వనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కూడా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు "వైఎస్‌ఆర్ వాహన మిత్ర" (YSR Vahana Mitra) పేరుతో ఆర్థిక సాయం చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ.10,000 ఇచ్చింది. వాహనాల మరమ్మతులు, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఖర్చులకు ఉపయోగపడుతుందని ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని 2019 అక్టోబర్ 4న ప్రారంభించారు. మొదటి ఏడాది సుమారు 2.36 లక్షల మంది లబ్ధిపొందారు. 2019లో రూ.236 కోట్లు పంపిణీ చేశారు. రెండో ఏడాదిలో 2.62 లక్షల మందికి లబ్ధి జరిగింది. 2020 రూ.262.49 కోట్లు పంపిణీ చేశారు. మూడో ఏడాది 2021లో 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్లు పంపిణీ చేశారు. 2022లో సుమారు 2.61 లక్షల మందికి రూ.261 కోట్లు ఇచ్చారు. 2023లో 2.76 లక్షల మందికి రూ.275.93 కోట్లు అందజేశారు. మొత్తం సుమారు 13 లక్షల మందికి రూ.1,301 కోట్లు జమ చేశారు.