Thalliki Vandanam Scheme:ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్‌ ప్రారంభమైన రోజే తల్లిఖాతాల్లో తల్లికి వందనం పేరుతో నగదు బదిలీ చేశారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు వేశారు. ఒక్కొక్క అకౌంట్‌లో 15వేల రూపాయలు పడ్డాయి. ఇప్పటి కూడా అర్హత ఉండి చాలా మంది ఈ పథకం డబ్బులు పొందలేకపోయారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం ఇస్తోంది. టెక్నికల్, లేక క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లు కారణంగా కొందరికి నగదు పడలేదని అలాంటి వారు స్థానిక సచివాలయ సిబ్బందిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా సూపర్ సిక్స్‌ పథకంలో భాగమైన తల్లికి వందనం ప్రారంభించింది. ఇన్ని రోజుల నుంచి ఊరిస్తూ వచ్చిన పథకం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు ఇస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింప జేసింది. ఒకటోతరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ అర్హులుగా ప్రకటించింది. తల్లు ఖాతాల్లో 13వేలు జమ చేస్తున్న ప్రభుత్వం పాఠశాలల ఖర్చుల కింద 2వేల రూపాయలను జిల్లా కలెక్టర్ ఖాతాల్లో వేస్తోంది. ఆయా స్కూల్స్‌ ఖర్చులకు కలెక్టర్ ఈ నిధులు పంపిణీ చేస్తారు.  

చాలా మంది బ్యాంకు అకౌంట్స్‌ డీయాక్టివేట్ అయ్యి ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. వారి అకౌంట్స్‌లో నగదు వేసినా తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేస్తోందని ముందు బ్యాంకు అకౌంట్స్‌ యాక్టివ్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుకు వెళ్లి యాక్టివ్ చేసుకొని పోన్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదట, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ కాలేదా లేదా NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో మ్యాప్ కాకపోయినా డబ్బులు రావు. ఈ లింకింగ్ జూన్ 5 లోపు పూర్తి చేయకపోతే డబ్బులు రావు. రెండోది హౌస్‌హోల్డ్ డేటా బేస్‌లో నమోదు కాకపోయినా, EKYC పూర్తి కాకపోయినా డబ్బులు రావు. మూడవది అర్హత జాబితాలో పేరు లేకపోవడం కూడా కారణం కావచ్చు. ఇది సాంకేతిక లోపం లేదా డేటాలో నమోదు కాకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు.  

అర్హత ఉండి డబ్బులు రానివాళ్లు మొదట, గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. అక్కడ అర్హులు  అనర్హుల జాబితా చూడండి. మీ పేరు ఉందా లేదా చూడండి. జాబితాలో పేరు లేకపోతే అక్కడి సిబ్బందిని కారణం అడిగి తెలుసుకోండి. రెండోది బ్యాంకు ఖాతా ఆధార్, NPCIతో లింక్ అయిందో లేదో ఆన్‌లైన్‌లో (npci.org.in) లేదా బ్యాంక్‌లో చెక్ చేయండి. లింక్ కాలేదని తెలిస్తే, సమీప బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో వెంటనే లింక్ చేసుకోవచ్చు. 

హౌస్‌హోల్డ్ డేటా బేస్‌లో నమోదు అయ్యిందా, EKYC పూర్తైందా అని సచివాలయంలో అడిగి తెలుసుకోండి.  నమోదు కాకపోతే  వారి సహాయంతో నమోదు చేయించుకోండి. నాల్గోది జాబితాలో పేరు లేకపోతే మీ అభ్యంతరాలు తెలియజేస్తూ ఫిర్యాదు. చేయండి. దీనికి సచివాలయంలో గ్రీవెన్స్ ఫారం పూర్తి చేసి, ఆధార్ కార్డ్ కాపీ, బ్యాంకు పాస్‌బుక్, స్టూడెంట్ ఐడీ సర్టిఫికెట్‌ను జత చేయండి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం కూడా అవసరం. ఈ అభ్యంతరాలను జూన్ 20, 2025 వరకు సమర్పించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అర్హత ఉన్నా డబ్బులు రానివాళ్లు తమ విద్యార్థి ఐడీ లేదా ఆధార్ నంబర్‌ను సచివాలయంలో చూపించి సమాచారం తెలుసుకోవచ్చు. జాబితాలో పేరు ఉన్నా డబ్బులు రాకపోతే సాంకేతిక లోపం కారణం కావచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సచివాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.