చంద్రబాబు అసత్య హరిశ్చంద్రుడంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన చరిత్ర తెలుగు దేశం పార్టీదే అని విమర్శించారు. ఏపీలో ఇప్పటివరకూ చంద్రబాబుకు స్థిర నివాసం లేదని అన్నారు. క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌ సీపీకి సంపూర్ణ బలం ఉందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం (ఆగస్టు 17) ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 51 శాతానికి పైగా ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని.. గతంలో వచ్చిన 151 సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గబోదని అన్నారు.


వైఎస్సార్‌సీపీ ఘన విజయం సర్వేల ద్వారా తేలిపోయిందని విజయసాయి రెడ్డి అన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్టును విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. 2024 తర్వాత టీడీపీ అంతర్థానం అయిపోతుందని జోస్యం చెప్పారు. అసాంఘిక వ్యక్తులకు టీడీపీ మద్దతు పలుకుతోందని, అలాంటి పార్టీ అసలు రాజకీయ పార్టీనే కాదని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లోకేష్‌కు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు లేదని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ అని.. అధికారం కోసం టీడీపీ నేతలు దేశ ద్రోహానికి కూడా వెనకాడబోరని అన్నారు. దేశ వ్యతిరేక శక్తులతో కూడా పొత్తు పెట్టుకుంటారని అన్నారు. 


చంద్రబాబు ప్రతీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నారని.. టీడీపీ ఏర్పాటు చేయబోయే కూటమికి గట్టిగా గుణపాఠం చెప్పిస్తామని అన్నారు. చంద్రబాబు తనను తాను సింహంలా ఊహించుకుంటున్నాడని అన్నారు. ఏపీలో చంద్రబాబుకు ఒక స్థిర నివాసం అనేదే లేదని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుని గొప్ప విజన్‌ అంటూ చంద్రబాబు హడావుడి చేస్తారని అన్నారు. విజన్‌ 2047 అంటూ కొత్త రాగం అందుకుని.. ప్రజలను నమ్మించి మోసం చేసేందుకే చంద్రబాబు మరో నాటకం మొదలుపెట్టారని అన్నారు. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.


‘‘నాలుగేళ్లుగా జాతీయ మీడియా సంస్థలు పలు దఫాలుగా నిర్వహించిన  సర్వేల్లో వైస్సార్సీపీకి 51% మించిన ప్రజాదరణ ఉంది. ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కలిపినా 40% దాటలేదు. పంచాయతీ, స్థానికి సంస్థల ఫలితాలైతే మర్చిపోలేనివి. అయినా దింపుడు కల్లం ఆశలతో బాబు గారు ఏవేవో మాయలు, కుట్రలు చేస్తూనే ఉన్నారు. విద్య, వైద్య, రంగాలు, పేదలకు ఇళ్ల నిర్మాణానికి జగన్ గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. 31 లక్షల గృహాల నిర్మాణం జరుగుతోంది. 17 మెడికల్ కాలేజీలు, వైద్యశాఖలో 53,126 పోస్టుల భర్తీ, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు, నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.