Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినికి ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.  ఆమె పై అవినీతి నిరోధక శాఖ(ACB) కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఓ ఐపీఎస్ అధికారిని ఏ2గా చేర్చింది. YSRCP హయాంలో  పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలోని విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమాన్యంపై విజిలెన్స్‌ తనిఖీల ముసుగులో బెదిరింపులకు పాల్పడ్డారని.. రూ.2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని విడుదల రజినీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆరోపణలు రాగా తొలుత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఆ విభాగానికి చెందిన డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌కుమార్‌ గుప్తా విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆ నివేదిక సిఫార్స్ మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇందుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు.   


ఏకంగా ఐఏఎస్ కూడా 
లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు మీద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది అయిన విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్ల పై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్స్ కు ఫిర్యాదు అందగా.. ఆ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ హరీష్‌కుమార్‌ గుప్తా విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ సింగ్‌ ప్రాథమిక దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. 


రూ.5 కోట్లు డిమాండ్
కేసు విషయానికి వస్తే.. ‘2020 సెప్టెంబరు 4న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ కండ్రికను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, స్టోన్ క్రషర్ ను మూయించకుండా ఉండాలంటే రజినిని కలవాలని ఆదేశించారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని ఆఫీసుకు వెళ్లి కలిశారు. వ్యాపారం సజావుగా జరగాలంటే  అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని, మిగతా విషయాలన్నీ తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారికి హుకుం జారీ చేశారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5కోట్లు డిమాండ్ చేశారు.  


విజిలెన్స్‌ తనిఖీలతో ఆయన హడావుడి
ఆ తర్వాత వారం రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఆర్‌వీఈవో)గా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా తన బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లారు. ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే హడావుడి చేశారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్‌ మెయిన్ ఆఫీసుకు ఈ తనిఖీల గురించి సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక రెడీ చేశారు.జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని మిగతా అధికారులను ఏసీబీకి తెలిపారు. 


డబ్బుల కట్టాల్సిందేనంటూ బెదిరింపులు
స్టోన్‌క్రషర్‌లో తనిఖీల అనంతరం జాషువా దాని యజమానులకు ఫోన్‌ చేశారు. వెంటనే విడదల రజినిని కలవాలని.. లేకపోతే రూ.50కోట్లు జరిమానాతో పాటు క్రషర్‌ను మూయించేస్తానని బెదిరించారు. దీంతో వారు రజినిని కలిశారు. పీఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. స్టోన్ క్రషర్ యజమానికి ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో  రజిని ఆదేశాల మేరకు.. ఆమె మరిది విడదల గోపిని కలిసి రూ.2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో ఐఏఎస్ జాషువాకు రూ.10 లక్షలు, గోపికి మరో రూ.10లక్షలు ఇచ్చారు. విడదల రజిని ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. ఇన్ని డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే  క్రిమినల్‌ కేసులు పెడతామని బెదిరించారని యజమానులు చెప్పారు’ అని ఏసీబీ ఎఫ్ఐఆర్‎లో పేర్కొంది.