AP Highcourt On Amaravati : రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభలు నిర్వహించకుండా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రైతుల తరపున హైకోర్టు లో శుక్రవారం లంచ్ మోషన్ పిటీషన్‌లు దాఖలయ్యాయి. మందడం, లింగాయపాలెం గ్రామాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించింది. అదే విధంగా మిగతా 17 గ్రామాల్లో రెండు రోజుల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాస్టర్ ప్లాన్ మార్చి ఇళ్ల లబ్దిదారులకు స్థలాలివ్వాలనుకుంటున్న ప్రభుత్వం
ఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఆర్ -5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయాపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో .. తుళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్ -5 జోనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.జోనింగ్ లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు సలహాలు 15 రోజుల్లోగా తెలియచేయాలని స్పష్టం చేసింది. అక్టోబరు 28 తేదీ నుంచి నవంబరు 11 తేదీ వరకూ 15 రోజుల పాటు సీఆర్డీఏకి అభ్యంతరాలుంటే చెప్పాలని సర్కార్ సూచించింది.
చట్ట సవరణ ద్వారా మరో సారి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం !
ఇలా చేయడానికి హక్కు కల్పించుకునేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ , ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాల సవరించారు. ఈ చట్టం ఆధారంగా సర్కార్ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసింది. దీనితో అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా ఇతర ప్రాంతాల వారికీ కూడా ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. కానీ ఇలా మార్పులు చేయడం చట్ట విరుద్ధమని..భూములు ఇచ్చిన రైతుల హక్కులకు భంగమని రైతులు వాదిస్తున్నారు. ఇంతకు ముందురెండు గ్రామాల్లో మాత్రమే గ్రామసభలు నిర్వహించారు. కానీ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో పదిహేడు గ్రామాల్లోనూ నిర్వహించనున్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలను నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్న రాజధాని గ్రామాలు !
గతంలోనూ రాజధానిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయడానికి నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టారు. గ్రామసభల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో ప్రభుత్వం ముందుకెళ్లలేకపోయింది. ఇప్పుడు ఆర్ 5 జోన్ విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే గ్రామ సభల్లోనూ అనుకూలత రాకపోయినా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది,. అందుకే రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను పేదల పేరుతో ఇతరులకు పంచడానికి ప్రభుత్వం సన్నాహాుల చేస్తోందన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.