CM Jagan : పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థకు చెందిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ విధానంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలకు ఏపీ కేంద్రం అవుతుందన్నారు.  


ఐటీసీ స్పైస్‌ ప్లాంట్‌ 


 ఐటీసీ గ్లోబల్‌ స్పైస్‌ ప్లాంట్‌ ప్రారంభం కావటం అద్భుతమైన ఘట్టమని సీఎం జగన్ అభివర్ణించారు. దాదాపుగా రూ.200 కోట్ల పెట్టుబడి, ఏటా 20 వేల మెట్రిక్‌ టన్నుల మిర్చితో పాటు మరో 15 రకాల సుగంధ ద్రవ్యాలన్నింటినీ ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేస్తారని తెలిపారు. మిర్చితో పాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రీయ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేస్తారన్నారు. ఈ ప్లాంట్‌ తొలిదశ పూర్తయిందని, రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని వివరించారు. అది కూడా పూర్తయితే...  దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ఏపీలో ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే 20 వేల మెట్రిక్‌ టన్నుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడుతున్నారని, దీని వల్ల  ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేనున్నారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 14 వేల మంది రైతులకు ఈ ప్లాంట్ ఒక గొప్ప వరంగా ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. నవంబరు 2020లో ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించారని,  కేవలం 24 నెలల కాలంలోనే ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించి, పనులు పూర్తి చేసారని సీఎం జగన్ కొనియాడారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయి అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంత ఉందన్నదానికి వేరే నిదర్శనం అవసరం లేదన్నారు.


రూ.3450 కోట్లతో 26 జిల్లాల్లో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు 


పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. 26 జిల్లాలు ఏర్పాటు ద్వారా ప్రతి జిల్లాలోనూ రైతులు స్థానికంగా పండించే పంటలన్నింటికీ కూడా ఇంకా మెరుగైన ధర రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు ఉండాలని, వాల్యూ ఎడిషన్‌ ద్వారా సాధ్యమవుతుందన్నారు. 26 పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రూ.3450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌ చేసిందన్నారు. దీని వల్ల ప్రతి జిల్లాలో రైతులకు మేలు చేయడమే కాకుండా దాదాపు 33 వేల ఉద్యోగాలు కూడా వస్తామని జగన్ వ్యాఖ్యానించారు. ఇందులో ఫేజ్‌ –1 కు సంబంధించి 10 యూనిట్ల కోసం రూ.1250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కార్యక్రమాలు డిసెంబరు, జనవరిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.  


రైతుల ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్‌ 


ఈ స్పైస్‌ ప్లాంట్‌కు సంబంధించిన ప్రొసీజర్‌ ఎలా ఉంటుందన్న దాని పై కూడా విచారణ చేశానని సీఎం జగన్ తెలిపారు.  ప్రొసీజర్‌ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారో కూడా తెలుసుకున్నానన్నారు. మెటీరియల్‌ వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీస్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్‌ స్టెరిలైజేషన్, ప్యాకింగ్‌ ఇటువంటి రకరకాల పద్ధతిలో ప్రాసెసింగ్‌ పూర్తి చేసుకుంటే రైతులు పండించిన పంటకు వాల్యూ ఎడిషన్‌ జరుగుతుందని చెప్పారు. ఎక్స్‌పోర్ట్‌ మార్కెట్‌లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. ఇటువంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏపీలో రావడం రైతులుకు మేలు జరుగుతుందన్నారు. ఇన్ని వందల కోట్ల రూపాయిల పెట్టుబడితో ఇక్కడ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టారు కాబట్టి.. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తుందని తెలిపారు.


ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ప్రభుత్వం 


ఐటీసీ సంస్థ ఏపీలో ఇంకా మెరుగైన ఫలితాలను సాధించాలని, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐటీసీకి అన్ని రకాల మద్దతు ఇచ్చే విషయంలో వెనుకడుగు ఎప్పుడూ ఉండదని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటుందన్నారు.