Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం నిధులు మరికొన్ని రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమవుతోంది. 2026 విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపకల్పన, నగదు జమ ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో సాగుతున్న ఈ పథకం ద్వారా ఈ ఏడాది లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట కలగనుంది.
78 లక్షల మంది అర్హులు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది విద్యార్థులను తల్లికి వందనం పథకానికి ప్రాథమికంగా అర్హులుగా తేల్చారు. పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల డేటాను ఇప్పటికే క్రోడీకరించి, తుది వడపోత కోసం క్షేత్రస్థాయి అధికారులకు పంపారు. ప్రస్తుతం గ్రామ, వారు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులు ఈ వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఈ తనిఖీ ప్రక్రియలో భాగంగా, విద్యార్థుల హాజరు, కుటుంబ ఆర్థిక స్థితిగతులు, ఇతర అర్హత ప్రమాణాలను సరి చూస్తున్నారు. అనర్హులను తొలగించి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ పరిశీలన సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అర్హుల తుది జాబితాను విడుదల చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదును విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాఠశాలలకు వెళ్లడం మానేయకూడదనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించడానికి, వారి విద్యా అవసరాల కోసం ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి, డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడానికి తీసుకున్న ఒక సామాజిక విప్లవం.
ఖాతాల్లో డబ్బులు పడాలంటే మీరు చేయాల్సిన పనులు ఇవే !
తల్లికి వందనం నిధులు ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నేరుగా ఖాతాల్లో జమ కావాలి అంటే లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉంచుకోవాలి. అలా ఉందో లేదో చూడాలి. చాలా కాలం నుంచి లావాదేవీలు జరపని ఖాతాలు ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కీలకమైన అంశం. ప్రభుత్వ పథకాల నగదు డైరెక్ట్‌గా బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అందాలంటే, ఖాతాకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి అయి ఉండాలి. పాఠశాల రికార్డుల్లో, సచివాలయ డేటాలో విద్యార్థి, తల్లి వివరాలు ఒకే విధంగా ఉండాలి.
తల్లిదండ్రులు తమ వివరాలను లేదా ఎన్‌పీసీఐ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
గత ఏడాది వివరాలు పరిశీలిస్తే...
గత ఆర్థిక సంవత్సరం ఏపీ ప్రభుత్వం సుమా౩రు రూ. 8, 711 కోట్లను విద్యార్థుల కుటుంబాల ఖాతాల్లో జమ చేసింది. ఈ భారీ మొత్తం రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లేదా అంత కంటే ఎక్కువ మొత్తంలో నిధుల విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
