అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. నిన్నటి నుంచి పోలీసులు విధిస్తున్న ఆంక్షలతో విసిగిపోయామని.. కోర్టు నుంచి మళ్లీ ఆదేశాలు తీసుకొచ్చి పాదయాత్ర పునఃప్రారంభిస్తామంటున్నారు. కోర్టు సెలవులు ఉన్నందున నాలుగు రోజుల  పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చినట్టు తెలిపారు.


అమరావతి రైతులు అరసవల్లి వరకు చేపట్టన పాదయాత్ర ప్రస్తుతం డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కొనసాగుతోంది. నిన్నటి నుంచి రైతులు పాదయాత్రను చుట్టు ముట్టి ఆనేక ఆంక్షలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మద్దతు తెలిపేవారిని రానివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారి ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారని ఆరోపించారు.


హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సాకుగా చూపించి 600 మంది గుర్తింపు కార్డులు అడగుతున్నారని అన్నాడు. అనుమతి ఉన్న వాహనాలను తప్ప వేరే వాహనాలను అంగీకరించబోమంటున్నారని వివరించారు. ఈ క్రమలో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. 


శుక్రవారం రామచంద్రాపురంలోకి వెళ్లే క్రమంలో తీవ్ర ఉద్రికత చోటు చేసుకుంది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తాళ్లు అడ్డుపెట్టి నెట్టేయడంతో చాలా మంది రైతులు గాయపడ్డారు. రైతులను పోలీసులు తోసేశారని అమరావతి జేఏసీ కన్నీనర్‌ శివారెడ్డి ఆరోపించారు. 


రాత్రి కూడా రైతులు బస చేసిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఐడీ కార్డులు చూపించాలని ఉదయం నుంచి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజు ఘర్షణ పడుతూ యాత్ర కొనసాగించలేమని... మళ్లీ కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామంటున్నారు రైతులు. నాలుగు రోజులు సెలవులు ఉన్నందున అప్పటి వరకు యాత్రను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.