Breaking News: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 06 Sep 2021 05:58 PM
వైసీసీ నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలిపోతున్నాయి.. టీడీపీ నేత సోమిరెడ్డి

సర్వేపల్లిలో ప్రభుత్వ భూమి మాయమవుతోందని.. అధికార పార్టీ వైసీసీ నేతల ధనదాహానికి వ్యవస్థలు సైతం కూలిపోతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. చిల్లకూరులో 250 ఎకరాల ప్రభుత్వ భూమి, నెల్లూరు కాకుటూరులో రూ.60 కోట్ల విలువైన భూమి ఎలా మాయమైందో చెప్పాలని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్వోలు ఫిర్యాదు చేసినా ఏపీలో కేసులు నమోదు కావడం లేదన్నారు.

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

హైద‌రాబాద్ న‌గ‌రానికి వాతావరణ అధికారులు అతి భారీ వ‌ర్ష హెచ్చరిక జారీ చేశారు. మ‌రో గంట‌లో భారీ వ‌ర్షం ప‌డుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించారు. నగరంలో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. వాతావరణ అధికారుల సూచనతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమ‌త్తమ‌య్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంట‌ల పాటు వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చరించారు. ప్రజ‌లు ఇళ్లనే ఉండాల‌ని అధికారులు సూచించారు. స‌హాయం కోసం 040 – 2955 5500 నంబ‌ర్‌ను సంప్రదించాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

KCR Meet Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్‌ రింగ్ రోడ్డును ఆమోదించినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లకు నిధులు కోరారు. కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటికే మంజూరైన హైవేలకు త్వరగా నెంబర్లు ఇవ్వాలని అభ్యర్థించారు. 


నాలుగు రోజులుగా ఢిల్లోనే ఉన్న సీఎం కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క‌లిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు.

ప్రేమ్ కరణ్ రెడ్డిపై చర్యలు

సూర్యాపేట జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రేమ్ కరణ్ రెడ్డిని కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర విద్యా వ్యవస్థపై ప్రేమ్ కరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజా చర్యలతో ఇంచార్జ్ జెడ్పీ సీఈవోగా ఆర్డీవో రాజేంద్ర కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.

వరవరరావుకు బెయిల్ పొడిగింపు.. ఆ పిటిషన్ వాయిదా

విరసం నేత వరవరరావు బెయిల్‌ను బాంబే హైకోర్టు మరోసారి పొడిగించింది. అయితే, తెలంగాణకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ నెల 24 వరకు ఇదే స్థితిని కొనసాగించాలని హైకోర్టు అదేశించింది. ఈ నెల 24 వరకు కచ్చితంగా ముంబయిలోనే ఉండాలని వరవరరావును హైకోర్టు ఆదేశించింది.

ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

ఏపీ ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకుని, ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చని తెలిపింది. ఈ విద్యా సంవత్సరానికి గతంలో మాదిరిగా అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశించింది.

సీఎం జగన్ ను కలిసి హీరో మంచు మనోజ్

ఏపీ సీఎం జగన్ ను హీరో మంచు మనోజ్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మనోజ్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. సీఎం జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని మనోజ్ అన్నారు. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు, దూరదృష్టి తనను బాగా ఆకర్షించాయన్నారు.  





తిరుపతి అతిథి భవనంపై నుండి దూకి పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్యాయత్నం

తిరుమలలోని విష్ణునివాసం అతిథి భవనంపై నుండి దూకి పారిశుద్ధ్య కార్మికుడు ఉదయ్ కుమార్ ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. గత రెండు రోజుల క్రితం విష్ణు నివాసంలో బస చేసిన భక్తుల వద్ద 11 గ్రాముల బంగారం అపహణరకు గురైంది. భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిన్న ఉదయ్ కుమార్ తో పాటు అతిథి భవనం సిబ్బందిని పోలీసులు విచారించారు. ఇవాళ మరోమారు విచారణకు హాజరు కావాలని పోలీసులు పిలవడంతో ఉదయ్ కుమార్ భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం విష్ణునిలయం భవనంపై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఉదయ్ కుమార్ ను చికిత్స నిమిత్తం అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రి తరలించారు. 

రికవరీ సొమ్ముతో ఉడాయించిన కానిస్టేబుల్ ఆచూకీ లభ్యం

కృష్ణా జిల్లా నూజివీడులో రికవరీ సొమ్ముతో పారిపోయిన కానిస్టేబుల్ జనార్దన్‌ ఆచూకీ లభ్యమైంది. కానిస్టేబుల్‌ను చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని చెన్నై నుంచి నూజివీడుకు తీసుకువస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నూజివీడు పట్టణ పోలీస్‌స్టేషన్ లో ఉంచిన సుమారు రూ.16 లక్షల రికవరీ సొమ్ముతో కానిస్టేబుల్‌ ఉడాయించాడు. 

నకిలీ ప్యారాచూట్ ఆయిల్, రెడ్ లేబుల్ టీ పొడి ముఠా గుట్టురట్టు

కర్నూలు జిల్లాలో నకిలీ ఆయిల్, టీ పొడి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నకిలీ ప్యారాచూట్ ఆయిల్, రెడ్ లేబుల్ టీ పొడిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేేశారు. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ వ్యాపారం జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వస్తువుల తయారీ, విక్రయ వ్యాపారం 7 రాష్ట్రాలకు విస్తరించినట్లు గుర్తించారు.

ట్రైబ్యునళ్లు మూసివేయమంటారా?... కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పులంటే గౌరవం లేదా, కోర్టు సహనాన్ని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించింది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీజేపీ ధర్మాసనం... ట్రైబ్యునళ్లను మూసివేయమంటారా? అని ప్రశ్నించింది. గతంలో రద్దు చేసిన అంశాలతో మళ్లీ మరో చట్టాన్ని పార్లమెంటు ఆమోదించడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 

తెలంగాణలో ఏపీ విద్యాసంస్థలు పెత్తనం... జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ విద్యాసంస్థలు పెత్తనం ఎక్కువైందని వ్యాఖ్యానించారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు చెప్పినట్లు ప్రభుత్వం నడుస్తోదని అన్నారు. ఎన్నికలకు అడ్డొచ్చిన కరోనా.. పాఠశాలలు తెరిచేందుకు ఎందుకు అడ్డురాలేదని అన్నారు. 

అదుపుతప్పి కాలువ అంచున ఒరిగిన బస్సు 

గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో ప్రమాదం చోటుచేసుకుంది. తెనాలి నుంచి భట్టిప్రోలు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కాల్వ అంచున ఒరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. క్రేన్ సహయంతో ఆర్టీసీ అధికారులు బస్సును పక్కకు లాగారు. 

తాలిబన్ల వశమైన పంజ్ షీర్

అఫ్గానిస్థాన్ పంజ్ షీర్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ సాయంతో పంజ్ షీర్ పై బాంబుల వర్షం కురిపించారు. ఆ ప్రావిన్స్ లోని గవర్నర్ బంగ్లాపై తాలిబన్ల తెల్ల జెండా ఎగరవేశారు. పంజ్ షీర్ సైన్యం కమాండర్ సలేహ్ ను కాల్చిచంపారు. ఆయన ఇంటిని బాంబులతో కూల్చివేశారు.   

బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 2 కోట్ల విలువైన బంగారం మాయం

గుంటూరు జిల్లా బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం గల్లంతైంది. ఈ వ్యవహారంలో బ్యాంక్ అటెండర్ హస్తముందని బ్యాంక్ రీజనల్ మేనేజర్ తెలిపారు. ఈ విషయంపై ఆయన పట్టణ పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. నిందితుడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని టౌన్ సీఐ  కృష్ణయ్య అన్నారు. రీజనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు యువకులు మృతి

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వండలూర్‌ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం... రాహుల్‌ కార్తికేయన్‌, రాజహరీష్‌, అరవింద్‌ శంకర్‌, అజయ్‌, నవీన్‌ స్నేహితులు. వీరంతా ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగాల కోసం చెన్నైలోని ఓ ప్రముఖ కంపెనీలో సోమవారం ఇంటర్వ్యూ ఉండటంతో కారులో శనివారం బయలుదేరారు. వీళ్లు ప్రయాణిస్తున్న కారు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెంగల్పట్టు జిల్లా పెరుంగళత్తూర్‌ సమీపంలో ఆగి ఉన్న ఇనుప కడ్డీల లోడు లారీని ఢీకొంది. ప్రమాదంలో అయిదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను తీసి ఆసుపత్రికి తరలించారు. 

Background

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్ధిపేట మీదుగా హైదరాబాద్‌కు వస్తుంది. ప్రజ్ఞాపూర్ వద్దకు చేరుకోగానే రాజీవ్ రహదారి నుంచి జగదేవపూర్ వైపు వెళ్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.