Minister RK Roja: ఏపీ మంత్రి ఆర్కే రోజా భర్త ఆర్కే సెల్వమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీలో విపక్ష నేతల విమర్శలకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కే సెల్వమణి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, విశాఖపట్నంలో సినిమా షూటింగులు ఆపేయాలని ఆయన తమిళ సినీ పరిశ్రమను కోరారు. పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోయారని చెప్పారు. దీంతో ఏపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఇక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెల్వమణి వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు స్పందిస్తూ.. సెల్వమణి వ్యాఖ్యలు ఏపీకి నష్టం కలిగించేలా, రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు. శుక్రవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా చెబుతుంటే ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సెల్వమణి వ్యాఖ్యలు దేనికి సంకేతమని.. రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో అని వ్యాఖ్యలు చేశారు.
తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక రాష్ట్రంలో పర్యటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పొరుగు రాష్ట్రాల్లో పర్యటించడం తప్ప రాష్ట్రంలో ఏదైనా పర్యటక ప్రాంతాన్ని సందర్శించారా? అని ప్రశ్నించారు. భర్త చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు.
RK Selvamani ఆర్కే సెల్వమణి వ్యాఖ్యలివీ
ఆర్కే సెల్వమణి ప్రస్తుతం ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకి అధ్యక్షుడిగా, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ కార్యక్రమంలో రెండ్రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమా షూటింగులు ఆపేయాలని తమిళ సినీ పరిశ్రమను కోరారు. పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోతున్నారని చెప్పారు.
తమిళ సినీ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్‌లలో కూడా షూటింగ్‌లు చేపడుతున్నారని అన్నారు. కథ డిమాండ్ మేరకు షూటింగులు ఎక్కడ జరుపుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. కానీ, భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం సరికాదని చెప్పారు.
పయనూరులో దేశంలోనే అతి పెద్దదని, ఆసియాలోనే రెండో అతిపెద్ద ఫ్లోర్ ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఎత్తైన ప్రహరీ గోడతో 15 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణం ఉందని చెప్పారు. అక్కడ ఎలాంటి భయం లేకుండానే షూటింగులు చేసుకోవచ్చని అన్నారు. అజిత్ ప్రతిచిత్రం దాదాపు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుకుంటోందని, దీనివల్ల తమిళ సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.