ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు మరింత వేడెక్కాయి. అందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే కారణంగా కనిపిస్తోంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుతూ బిల్లును అసెంబ్లీలో అధికార వైసీపీ ప్రవేశపెట్టింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టారు. దీనిపై సభలో రగడ జరిగింది, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు అధికార ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పేపర్లు చింపి స్పీకర్ తమ్మినేని సీతారాంపై విసిరేశారు. టీడీపీ సభ్యులు 13 మందిని స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చేస్తారు.. పయ్యావుల కేశవ్
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్చాలన్న నిర్ణయాన్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. వర్సిటీల పేర్లనే కాదు ఏపీ సీఎం జగన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మారుస్తారంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే రాష్ట్రం పేరును జగనాంధ్రప్రదేశ్ అని సీఎం జగన్ మార్చేలా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు పయ్యావుల. విశ్వవిశ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం ఎన్టీఆర్ పేరు తొలగించాలని మీకు ఎలా అనిపిస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని పయ్యావుల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా?, అన్ని పథకాలకు, వర్సిటీలతో పాటు రాష్ట్రం పేరు కూడా జగనాంధ్రప్రదేశ్ అని మారుస్తారంటూ వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.
తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్: నారా లోకేశ్
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య అని అభివర్ణించారు. తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని, అయినా కూడా వైఎస్సార్ కు, ఈ హెల్త్ యూనివర్సిటీకి సంబంధమేంటని ప్రశ్నించారు. వర్సిటీని నెలకొల్పి, అభివృద్ధి చేసింది కూడా దివంగత నేత ఎన్టీఆరేనని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు.
వైద్య విద్యలో నాణ్యత పెంచి,పర్యవేక్షణ, నియంత్రణ సాధించేందుకు ఒక స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థ ఉండాలని భావించిన ఎన్టీఆర్. 1986లో ప్రత్యేకంగా హెల్త్ వర్సిటీని ప్రారంభించారు.ఇంత చేసినా దానికి తనపేరు పెట్టుకోకుండా 'యునివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్' అని పెట్టారు ఎన్టీఆర్. ఆయన చనిపోయాక ఎన్టీఆర్ గౌరవార్థం 1998లో అప్పటి సీఎం చంద్రబాబు 'ఎన్టీఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' అని పేరు మార్చారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ఎన్టీఆర్ మీద గౌరవంతో పేరు మార్చే ప్రయత్నం చేయలేదని’ టీడీపీ నేతలు చెబుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తాం: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
బీసీల అన్నతి కోసమే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని చెప్పారు. వైద్య విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ వర్సిటీ స్థాపించారు, కానీ నేడు మహనీయుడు ఎన్టీఆర్ పేరు వర్సిటీకి తొలగిస్తే బీసీలు ఊరుకోరు అని ఎమ్మెల్యే అనగాని వ్యాఖ్యానించారు. ఆగ్రహం కట్టలు తెంచుకుని తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తాంమని హెచ్చరించారు.