ఏపీ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. నేడు (సెప్టెంబరు 21) దానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నందున.. ఉదయం 9 గంటలకు శాసన సభ ప్రారంభం కాగానే, టీడీపీ సభ్యులు నిరసన మొదలుపెట్టారు. తొలుత స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దాన్ని అడ్డుకున్న టీడీపీ సభ్యులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. పోడియం వద్దకు కూడా వచ్చి నినాదాలు చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును వైసీపీ మంత్రులు, నేతలు తప్పుబట్టారు. అయినా వారు పట్టు విడవకుండా నిరసన మరింత ఎక్కువ చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
స్పీకర్‌పై పేపర్లు చింపి వేసిన టీడీపీ సభ్యులు, అంతా సస్పెన్షన్
ఏపీ శాసనసభ మళ్లీ 11 గంటలు దాటాక తిరిగి ప్రారంభం అయింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ సభ్యులు మళ్లీ నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా స్పీకర్ కుర్చీని చుట్టుముట్టి, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లు ప్రతులను చింపి స్పీకర్ మీద వేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పీకర్ 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లకుండా తమ నిరసన కొనసాగించడంతో మార్షల్స్ సాయంతో వారిని బలవంతంగా బయటికి పంపించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ నేతలు అసెంబ్లీ బయట ఆందోళన చేశారు. జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్న రాజప్ప మాట్లాడుతూ సీఎం జగన్ తుగ్లక్ చర్యలు తీసుకుంటున్నారని, వాటిని అడ్డుకొని తీరతామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేయడం జగన్ నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ సీఎం జగన్ కొత్త సాంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్నారని, ఎన్టీఆర్ జోలికి వస్తే జగన్ ఇంటికే పరిమితమవుతారని హెచ్చరించారు.
ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి తన పతనాన్ని తానే ప్రారంభించుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ సేవలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా పేరు మార్పు అనేది జరగలేదని అన్నారు. అంగర రామ్మోహన్ రావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే కడప జిల్లాకు వైఎస్ పేరును తొలగించే ఆలోచన జగన్ మోహన్ రెడ్డి కలిపిస్తున్నారని అన్నారు. హెల్త్ యూనిర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రం పేరునే మార్చేస్తారు - పయ్యావుల
వర్సిటీల పేర్లనే కాకుండా జగన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మారుస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే రాష్ట్రం పేరును జగనాంధ్రప్రదేశ్ అని మార్చేలా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు పయ్యావుల. విశ్వవిశ్యాత నట సార్వభౌముడు, దివంగత సీఎం ఎన్టీఆర్ పేరు తొలగించాలని మీకు ఎలా అనిపిస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని పయ్యావుల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా? అన్ని పథకాలకు, వర్సిటీలతో పాటు రాష్ట్రం పేరు కూడా జగనాంధ్రప్రదేశ్ అని మారుస్తారంటూ వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.