గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడి కుమారుడు సుత్తితో కొడుతూ ధ్వంసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
టీడీపీ నిరసనల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో పలువురు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ గుంటూరులోని చంద్రమౌళినగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. పల్నాడు ప్రాంతంలో ఆందోళన నిర్వహించిన టీడీపీ నేత చిరుమామిళ్ల మధుబాబు, ఒప్పిచర్ల వద్ద జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవింద బాబును హౌస్ అరెస్టు చేశారు.
నందమూరి రామకృష్ణ ఆగ్రహం
ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య తెలుగుజాతిని అవమానించినట్లేనని అన్నారు. ఇలాంటివి చేస్తే తెలుగు జాతి ఊరుకోదని, దుండగులను వెంటనే అరెస్టు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. మరోవైపు, చిలకలూరి పేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ స్కీములన్నీ స్కాములేనని.. రాష్ట్రంలో ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
నిందితుడి అరెస్టు
దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి కోటేశ్వరావును ఆదివారమే పోలీసులు అరెస్టు చేశారు. దుర్గి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోగా.. నేడు రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు సదరు ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: Sharmila: ఏపీలో పార్టీ పెట్టొచ్చు.. పెట్టకూడదన్న రూలేమన్నా ఉందా ? : షర్మిల