టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఫిర్యాదు చేసేందుకు నేడు గవర్నర్‌తో సమావేశం కానున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు అరెస్టు అయిన శనివారం నాడే గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసే ప్రయత్నం చేశారు. కానీ వీలుపడలేదు. ఆ ప్రోగ్రామ్ ఆదివారానికి వాయిదా పడింది. 


చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. దీని కోసం శనివారం అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతారని నేతలందర్నీ పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. మరికొందర్ని స్టేషన్‌లో ఉంచారు. రాత్రి వరకు చాలా మందిని విడిచిపెట్టలేదు. 


శనివారం సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు కానీ ఆయనకు కలుస్తామన్న నేతలంతా స్టేషన్‌లలో హౌస్‌ అరెస్టులో ఉండటంతో అపాయింట్‌మెంట్‌ను ఆదివారానికి వాయిదా వేయించారు. ఎమ్మెల్యేలు గణబాబు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రామారావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాస్‌ గవర్నర్‌‌ను కలిసి చంద్రబాబు అరెస్టు గురించి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఎఫ్ఐఆర్‌లో పేరులేని వ్యక్తిని అరెస్టు చేశారని టీడీపీ నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 


చంద్రబాబు విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పోలీసులు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించి 10 గంటలపాటు విచారించారు. చంద్రబాబు స్టేట్‌ మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్‌ చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


ఇన్వెస్టిగేషన్ అధికారికి చంద్రబాబు లేఖ
కేసు ఇన్వెస్టిగేషన్ అధికారికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తన తరఫు న్యాయవాదులను కలిసే హక్కు తనకు ఉందన్నారు. కేసుపై న్యాయపరమైన అంశాలు చర్చించడానికి నలుగురు న్యాయవాదులు అవసరం ఉందన్నారు. దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం. లక్ష్మీ నారాయణ, జవ్వాజి శరత్ చంద్రను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.  


చంద్రబాబు లాయర్లను అనుమతించని పోలీసులు
సిట్ కార్యాలయంలోకి చంద్రబాబు తరఫున వచ్చిన నలుగురు అడ్వకేట్లను పోలీసులు అనుమతించడం లేదు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై చంద్రబాబు తరఫు అడ్వకేట్లు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నింటిలో నిబంధనలకు విరుద్ధం‌గా దర్యాప్తు అధికారులు ప్రవర్తిస్తున్నారని  ఆరోపించారు.