ఆదాయపు పన్ను శాఖ నోటీసులకు ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదని, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో తన పై ఇలాంటి ఆరోపణలు చేయటం సర్వసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు.


తప్పుడు పార్టీ వైసీపీ - చంద్రబాబు


ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయని, అలాటి సమయంలోనే తనపై  ప్రతి సారీ ఆరోపణలు చేస్తారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారంటూ ఐటీ నోటీసులు ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి వాటికి ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదని చంద్రబాబు లైట్ తీసుకున్నారు. జగన్ పని అయిపోయిందని, జగన్ ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


చంద్రబాబు సెటైర్లు


రజనీ కాంత్ కొద్దిరోజుల క్రితం ఒక సభలో చెప్పిన తాజా డైలాగ్ ను ప్రస్తావిస్తూ కరెంట్ బాదుడుపై చంద్రబాబు సెటైర్లు వేశారు. కరెంట్ కోతలు లేని చోటు లేదు, కరెంట్ బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగని ఊరే లేదు.. అర్థమైందా సైకో జగన్ రెడ్డీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మద్య నిషేధం అని, మద్యం రేట్లు పెంచి జగన్ దోచుకుంటున్నాడని మండిపడ్డారు. జగన్ ను మళ్లీ నమ్మితే రూ.400 కరెంట్ బిల్లు రూ.4 వేలు అవుతుందని, 60 రూపాయల మందు క్వాటర్ బాటిల్ 500 అవుతుందని, దీని పై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  


ఓట్లు సరి చూసుకోండి


ఓట్లు ఇప్పటి నుంచే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితికి కూడా జగన్ కారణం అయ్యాడని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  జగన్ ఎక్కడో ఆఫీస్ పెట్టి మనకు పడే అవకాశం ఉన్న ఓట్లు తీసేస్తున్నాడని  చంద్రబాబు అన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లను చెక్ చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువగళం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, ఇక సైకిల్ ఆగే ప్రసక్తే లేదని, సైకిల్ అన్ స్టాపబుల్,  ఇక బ్రేకులు వేసే అవసరం కూడా లేకుండా దూసుకుపోవడమేనని కార్యకర్తలను చంద్రబాబు ఉత్సాహపపరిచారు. ప్రతి నియోజకవర్గం నుంచి సైకిల్ అసెంబ్లీకి రావాలన్నారు.


రాష్ట్రంలో రాజకీయ గాలి మారింది..


తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం మొదలు పెట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతోందని, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బ్రహ్మండంగా విజయవంతం అయ్యాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలు జరిగినా తెలగు దేశం పార్టీ గెలుస్తుందని, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవటం తెలుగు దేశం విజయంగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన  పంచాయతీ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం గెలిచిందని, 30 ఏళ్ల నుంచి గెలవనిచోట కూడా గెలిచిందన్నారు. ప్రజల్లో మార్పు ప్రారంభమైందని, టీడీపీ జైత్ర యాత్ర మొదలైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.