చాలా కాలం తర్వాత టీడీపీ అధినేత రాజకీయ సమావేశాల్లో పాల్గొన్నారు. నాలుగు నెలల తర్వాత ఆయన తొలిసారిగా ఎంపీలతో సమావేశమయ్యారు. నాల్గో తేదీ నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను చర్చించారు. ప్రతిపక్షాలే టార్గెట్‌గా ఏపీ సాగుతున్న పాలన తీరును పార్లమెంట్‌లో ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. ప్రత్యర్థులపై అక్రమకేసులు బనాయించి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాలన్నారు. 


ఉండవల్లిలో తెలుగుదేశం ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు నేతలకు పలు సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లో కరవు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. కరవు నివారణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 29 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సినవి, విభజన చట్టంలోని హామీలు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారని, స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడటం లేదని, రైల్వే జోన్‌ గురించి మాట్లాడేవాళ్లే లేరని ధ్వజమెత్తారు. వీటన్నింటిపై వైసీపీ వైఖరిని పార్లమెంట్‌ సాక్షిగా ఎండగట్టాలని సూచించారు చంద్రబాబు. 


రాష్ట్రంలోని ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని అన్నారు చంద్రబాబు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలకు లెక్కేలేకుండా పోతోందన్నారు. పేదరికం, నిరుద్యోగం, మహిళలపై దాడులు, కరవు, ధరల పెరుగుదల, ఛార్జీల మోత, అప్పులు, ఇలా ప్రధానాంశాలపై చర్చించారు.  రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయిందన్నారు టీడీపీ నేతలు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇసుక దోపిడీదారులపై ఈడీ దర్యాప్తు జరుగుతోందని ఏపీలో అంతకు మించి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చెయ్యాలన్నారు.  


లేని సమస్యలను సృష్టించి ప్రజల దృష్టి మరల్చడం తప్ప ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు టీడీపీ నేతలు, సాగర్ ప్రాజెక్టు వద్ద లేని సమస్యను సృష్టించారని ఆరోపించారు. అసలు కక్ష రాజకీయాలపై ఉన్న శ్రద్ధ నిధుల వినియోగం ఇతర అంశాలపై లేదని ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.