Bail To Surya Narayana: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 2021 మధ్య కాలంలో రాష్ట్ర వాణిజ్యపన్నుల పన్నుల చీఫ్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కేఆర్ సూర్యనారాయణ, సహోద్యోగులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని ప్రభుత్వం అభియోగం మోపింది.
ఏపీ జీఈఏ, ఏపీ కమర్షియల్ టాక్సెస్ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని కూడా ప్రభుత్వం అభియోగాల్లో పేర్కొంది. వీటిపై విజయవాడ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ జారీ చేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యనారాయణను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. విచారణను నవంబరు 10కి వాయిదా వేసింది.
ఇదీ సూర్యనారాయణపై ఉన్న కేసు
విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో 2023, మే 30వ తేదీన రిజిస్టర్ అయిన ఓ కేసులో ఏ-5గా సూర్యనారాయణ ఉన్నారు. 2019 నుంచి 2021 మధ్య కేఆర్ సూర్యనారాయణ, మెహర్ కుమార్, సంథ్య, వెంకట చలపతి, సత్యనారాయణలతో కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి. సూర్యనారాయణ మినహా మిగిలిన నలుగురిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. ఏ-5 సూర్యనారాయణతో కలిసి వారు కుట్ర చేసిన వివరాలు ప్రొసీడింగ్స్‌లో వెల్లడించారు. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సూర్యానారాయణతో కలిసి ఇతర నిందితులు భారీ మొత్తంలో వ్యాపారులు నుంచి తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేశారని తెలిపింది.
సూర్యనారాయణ ఉద్యోగంలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని ప్రభుత్వానికి కూడా హాని కలిగే అవకాశం ఉందంటూ ప్రొసీడింగ్స్‌లో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే విచారణకు సహకరించకపోవడంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సూర్యనారాయణపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్సన్ కాలం మొత్తం హెడ్ క్వార్టర్‌ను ముందస్తు అనుమతి లేకుండా వదలకూడదంటూ ఉత్తర్వుల్లో తెలిపింది.
జనవరిలో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన సూర్య నారాయణ
ప్రతి నెల ఒకటిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందేలా చట్టం చేయాలని ఏపీ ఉద్యోగ సంఘ ప్రతినిధులు అప్పటి గవర్నర్ విశ్వభూషన్‌ను కలిశారు. ఉద్యోగుల DA బకాయిలు, జీపీఎఫ్ బజాయిలు, సీపీఎస్ వాటా నిధులు 10వేల కోట్ల పైన ప్రభుత్వం బకాయి ఉందన్నారు, ఉద్యోగ సంఘ నాయకులు సూర్యనారాయణ.. ఉద్యోగులు ఆందోళన చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడ ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మమ్మల్ని రక్షించాలని గవర్నర్‌ను కలిశామని చెప్పుకొచ్చారు.
ఉద్యోగులు, పెన్షనర్లు, దినసరి కార్మికులకు చెల్లించాల్సిన నిధులు నెల చివరి రోజు లేదా తర్వాత నెల మొదటి రోజు చెల్లించాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు జీవోలతో సహా అన్ని వివరాలు వివరించామని.. ప్రభుత్వం నుంచి మొదటి చెల్లింపుదారుడిగా క్లెయిమ్స్ సెటిల్ చేసేలా చట్టాన్ని తీసుకురావాలని గవర్నర్ ను కోరామన్నారు. తగిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోని పక్షంలో ఏప్రిల్ నుంచి తీవ్ర ఆందోళనకు సిద్ధమవుతున్నామని వివరించారు.