Anna Canteens: ఈ నెల 15 నుండి ఏపీలో ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్ల కోసం భారీ విరాళం అందింది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. విజయవాడకు చెందిన ఎస్.ఎల్.వీ డెవలపర్స్ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. రాబోయే ఐదేళ్ల పాటు అన్నా క్యాంటీన్ కు కోటి రూపాయల చొప్పున విరాళం అందిస్తానని శ్రీనివాసరాజు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజును సీఎం చంద్రబాబు అభినందించారు.
ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటిన్లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించనున్నారు. మంత్రి నారాయణ ఈ విషయాన్ని మరోసారి తెలిపారు. అయితే, అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా టెండర్లను హరేకృష్ణ మూవ్ మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ ఇప్పటికే అక్షయపాత్ర పేరుతో బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తుంది. మొదటిసారి అన్నా క్యాంటిన్లు సప్లై చేసినప్పుడు కూడా ఇదే సంస్థ సప్లై చేసింది. ఈ సంస్థకు చెందిన భారీ కిచెన్ ను మంత్రి నారాయణ మంగళగిరి లోని తెనాలి రోడ్డులో సందర్శించారు. హరేకృష్ణ మూవ్ మెంట్ కు చెందిన భారీ కిచెన్ లో ఒకేసారి వేలాది మందికి అతి తక్కువ సమయంలో ఆహారం వండి సరఫరా చేసేలా కిచెన్ ఉంది.
ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం వండే విధానాన్ని, కూరగాయలు కట్ చేసే తీరు, కూరలు వండే విధానం, ప్యాకింగ్ ఎలా చేస్తారనే అంశాలను నిర్వహకులను మంత్రికి వివరించారు.