AP High Court on EWS quota seats GO in medical colleges | అమరావతి: ఓవైపు తెలంగాణలో మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలపై వివాదం నెలకొంది. స్థానికత తేల్చాలని, తమకు అన్యాయం జరుగుతోందని హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోతో స్థానికతపై వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోనూ వైద్యకళాశాలల్లో ప్రవేశాలు గందరగోళంగా మారాయి. ఏపీలో మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేసింది ఏపీ హైకోర్టు. ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 13న) ఏపీ హైకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా జీవో నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లకు సంబంధించిన జీవోను సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టులో ఆ పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచకుండానే జోవో ఇచ్చారని, ఆ నిర్ణయం తీసుకున్నాకే.. ఈడబ్ల్యూఎస్‌ (EWS Seats) కోటా సీట్లు భర్తీ చేయాలని పిటిషనర్‌ తరఫు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అలా జరగని పక్షంలో ఓపెన్‌ కేటగిరీ (Open Category) విద్యార్థులు నష్టపోయే అవకాశాలు అధికమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలు విన్న అనంతరం ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లకు సంబంధించిన జీవోను నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.