Guntur Railway Station: ఆ మధ్య వైజాగ్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన క్యాప్సూల్ హోటల్ సూపర్ సక్సెస్ కావడం తో రైల్వే అధికారులు ఇతర ముఖ్యమైన స్టేషన్ లలో కూడా ఇలాంటి హోటల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ లో కూడా ఒక  క్యాప్సూల్ హోటల్ ను రెడీ చేశారు.  దూర ప్రాంతాల నుంచి పని మీద వచ్చే ప్రయాణికులు తాత్కాలికంగా బస చేసేలా గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Continues below advertisement

ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు నాన్-ఫేర్ (టికెట్ అమ్మకాలు కాకుండా వచ్చే)  ఆదాయాలను పెంచే లక్ష్యంతో, గుంటూరు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం ప్లాట్‌ఫామ్ నెం. 1, గేట్ నెం. 3 వద్ద ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యం ప్రయాణీకులకు, కుటుంబాలకు, మహిళా ప్రయాణీకులకు సురక్షితమైన, ఆధునిక,  సరసమైన స్వల్పకాలిక వసతి సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఇటువంటి సౌకర్యం విశాఖపట్నం, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది .

స్లీపింగ్ పాడ్స్ ఫీచర్స్ ఏంటంటే.. 

  • స్లీపింగ్ పాడ్స్ సౌకర్యంలో భాగంగా 52 సింగిల్ బెడ్‌లు, 12 డబుల్ బెడ్‌లతో మొత్తం 64 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంది.  మొత్తం 64 బెడ్‌లలో, కుటుంబాలు,  ప్రత్యేకంగా మహిళలకు బెడ్‌లు  కేటాయించారు.   వాటిలో: 10 డబుల్ బెడ్‌లు, 12 సింగిల్ బెడ్‌లు ఉన్నాయి.
  • ఈ సౌకర్యం ప్రయాణీకులకు అనుకూలమైన అనేక సౌకర్యాలతో కూడి ఉంది.  ఇందులో  ఉచిత వైపై సౌకర్యం, వేడి నీటి సరఫరా, స్నాక్స్ బార్, ట్రావెల్ డెస్క్, నిద్రపోయేందుకు విశాలమైన, పరిశుభ్రమైన పరిసరాలు, శుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలు, వస్తువులను సురక్షితంగా నిల్వ చేయడానికి లాకర్ సౌకర్యం ఉంది.  

స్లీపింగ్ పాడ్స్ రేట్లు ఎంతంటే..

  • సింగిల్ బెడ్- 0 నుంచి 3 గంటలవరకు  – ₹150
  • 3 నుంచి 24 గంటలవరకు  – ₹300
  •  డబుల్ బెడ్- 0 నుండి 3 గంటలవరకు   – ₹250,
  •  3 నుంచి 24 గంటలవరకు  – ₹500
  •  గదులు- 0 నుంచి 3 గంటలవరకు – ₹300,
  •  3 నుంచి 24 గంటలవరకు – ₹1,000గా నిర్ణయించినట్టు

ప్రయాణీకులకు అనుకూలమైన స్నేహ పూరకమైన చొరవకు,  ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన బసను అందించినందుకు గుంటూరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్‌ను, గుంటూరు డివిజన్ బృందానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ  అభినందనలు తెలిపారు. 

Continues below advertisement

నాన్-ఫేర్ ఆదాయాన్ని సృష్టించడం కోసం రైల్వే ఈమధ్య అనేక చర్యలు తీసుకుంటుంది. స్టేషన్ లలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పించడం ద్వారా ప్రయాణీకులకు బయట హోటళ్ళలో అధిక రెంట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్టేషన్ లోనే వసతి సౌలభ్యం పొందేలా దక్షిణ మధ్య రైల్వే  ఈ క్యాప్సుల్ హోటల్ ను రెడీ చేసింది. ఇకపై ఏదైనా పనిమీద  గుంటూరు వచ్చే ప్రయాణికులు తాత్కాలికంగా ఉండడానికి ఈ స్లీపింగ్ పాడ్స్ హోటల్ చాలా హెల్ప్ చేయబోతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి కి పనుల కోసం వచ్చి కొద్ది గంటలు లేదా ఒకటిరెండు రోజులు ఉండి వెళ్లిపోయే వారికి ఈ క్యాప్సూల్ హోటల్ చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.